తెలంగాణలో బాల సాహిత్యం విరివిగా వస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలపై చిన్నపిల్లలకు అవగాహన కలిగించాలనే ఉద్యేశంతో విద్యాశాఖ కొత్త పాఠ్యాంశాలకు రూపకల్పన చేయడమే ఇందుకు కారణం. 6 నుంచి 10వ తరగతి వరకు గల తెలుగు పాఠ్య పుస్తకాల్లో పాఠం చివర సృజనాత్మకత, ప్రశంస ఉండేలా పాఠ్య పుస్తక రచయితలు ఏర్పాటుచేశారు. ఇందులో కథ, కవిత, సంభాషణ, లేఖారచనా, కరపత్రం, ఇంటర్వ్యూ, పుస్తక సమీక్ష వంటి సాహితీ ప్రక్రియలపై ప్రశ్నలుంటాయి. పరీక్షల్లోనూ వాటికి మార్కులుంటాయి. కాబట్టి తప్పకుండా వీటిని చదవడం, రాయడం చేస్తున్నారు.
విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయించే కార్యక్రమంలో భాగంగానే, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులకు సృజనాత్మక రచనల్లో తర్ఫీదునిస్తున్నారు. ఇది పిల్లల ఆలోచనలకు రెక్కలు తొడిగి, సృజనకారులుగా తయారవడానికి ఎంతో దోహదం చేస్తున్నది. నిబద్ధత, రచనారంగంలో కొంత ప్రవేశం ఉన్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పిల్లలను ప్రోత్సహిస్తూ, వారినుంచి మరిన్ని రచనలు రావడానికి కృషిచేస్తున్నారు.
ఖమ్మం జిల్లా అశ్వరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కన్నెగంటి వెంకటయ్య తన సంపాదకత్వంలో ‘చిగురాకుల సవ్వడి’ పేరుతో పిల్లలు రాసి న వచన కవితలను 2003లో సంకలనంగా తీసుకువచ్చారు. ముస్తాబాద్ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తున్న గరిపల్లి అశోక్ 2014లో తను సంపాదకుడిగా, పిల్లలతో ‘జాంపండ్లు’ కథా సంకలనాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లోని విద్యార్థుల రచనలతో సంకలనాలు వెలువడ్డాయి. ఇటీవలే వచ్చిన షాద్‌నగర్ పిల్లలు రాసిన ‘రంగుల ప్రపంచం’ కథా సంకలనం వరకూ 142 పుస్తకాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని సుమారు 4 వేల మంది బాలబాలికలు కల్పనాత్మక రచనలు చేస్తున్నారని ఒక అంచనా.
సంకలనాల సంగతి అలా ఉంచితే, తెలుగులో వెలువడే దిన, వారపత్రికలు, ఆన్లైన్ పత్రికలు, మాస పత్రికల్లో కలిపి వారానికి సుమారు నలభై పిల్ల ల కథలు వస్తున్నాయని విజ్ఞుల అభిప్రాయం. బాల సాహిత్యం రాసే రచయితలతో పాటు, పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థిని, విద్యార్థులు కూడా పత్రికల కు రాయడం ప్రారంభించారు. ఇది ఆహ్వానించదగి న పరిణామం. నెలకు సుమారు 150కి పైగా పిల్లల కథలు పలు పత్రికల్లో వెలుగుచూస్తున్నాయి. రాశిలో ఇంత ఎక్కువగా వస్తున్నా, కథల్లో వాసి తగ్గిపోతున్నదని, మనసుదాకా చేరడం లేదని సీనియర్ రచయితల అభిప్రాయం. ఇందులో వాస్తవం లేకపోలే దు. బాలసాహిత్య రచయితలకు సరైన మార్గదర్శక త్వం కొరవడటం వల్లనే ఇలా జరుగుతుందన్నది నిష్టుర సత్యం.
రచయితలు సాధారణంగా కథల్లో చేస్తున్న పొరపాట్ల గురించి చూద్దాం. ఇటీవల ఒక కథ పత్రికలో వచ్చింది. ఈ కథ అవగాహన లోపంతో రాసింది. ‘కొంతమంది వేటగాళ్లు అడవికి వచ్చి, ఏనుగును బంధించాలని, అది వచ్చేదారిలో ఉచ్చులు ఏర్పాటుచేశారు’ అని రచయిత రాశారు.
సాధారణంగా ఏనుగును పట్టుకోవడానికి పెద్దగోయి తవ్వి, దాని మీద సన్నటి పుల్ల లు పేర్చి, వాటిమీద చాప లేదా వస్త్రం వంటిది కప్పి, పైన కనిపించకుండా మట్టి చల్లి ఆకులు కప్పుతారు. అనుమానం రాకుండా ఈ ఏర్పాటు చేసి, ఏనుగు గోతిలో పడేలా చేస్తారు. తర్వాత తాళ్లతో బంధించి దంతాలు కోసుకుంటారు. ఎంత పెద్ద ఉచ్చులు వేసినా, ఏనుగు బలం ముందు అవి బలాదూరే. ఉచ్చులు పిట్టలకు వేస్తా రు. మరో రచయిత రాసిన కథ చదివి ఆశ్చర్యపోయా. ఆ కథలో గాడిదకు చక్కగా పాటలు పాడాలని ఉంటుంది. అది ఏ జంతువును అడిగినా నేర్పవు. అయినా తను అదేపనిగా పాటలు పాడుతుంది. దాని గాత్రానికి అడవిలోని జంతువులన్నీ గాడిదను అసహ్యించుకుంటాయి. అది చిన్నబుచ్చు కుంటుంది. అప్పుడు కోకిల వచ్చి గాడిదకు, పాడ టం నేర్పిస్తుంది. అది చక్కగా పాడుతుంటుంది. ఇదీ కథ. కొన్ని జంతువులకు, పక్షులకు సహజసిద్ధం గా పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వస్తాయి. లేడి వేగం గా పరిగెత్తడం, గద్ద దీర్ఘదృష్టి కలిగి ఉండటం మొదలైనవి. ఎంత కోకిల శిక్షణ ఇచ్చినా గాడిద కంఠస్వరంలో మార్పు వస్తుందా? రచయిత వస్తువును తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించాలి. మనం రాసే కథ చదువరులకు నమ్మకం కలిగించేలా ఉండాలి. ఎక్కువ కథ లు రాయాలనే తొందరలో రచయితలు ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు.
ఇంక రాజుల కథలు రాసేటప్పు డు రమేశ్, నరేశ్, పరిమళ, ప్రహేళిక అనే ఆధునిక పేర్లను వాడుతున్నా రు. రాజుల కాలంలో ఇంత నాగరికమైన పేర్లు లేవు. నాగమ్మ, కాటమయ్య, బొందయ్య మొదలైన ప్రాచీన పేర్లను ఉపయోగిస్తేనే, కథ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. ఇలాంటి చాలా విషయాల పట్ల బాల రచయితల కు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బాలల కథలు రాస్తున్న రచయితలు కూడా పై విషయాలను గమనంలో ఉంచుకోవాలి.
ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహి త్య పురస్కారం పొందిన పి.చంద్రశేఖర్ ఆజాద్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు గొప్ప మాట చెప్పారు.
‘మన తెలుగు బాల రచయితలు ఇంకా క్రీ.పూ.3 నుంచి 5వ శతాబ్దం మధ్యలో రాయబడిన పంచతంత్ర కథల దగ్గరే ఉన్నారు. ప్రపంచం ఎంత మారింది. పిల్లలు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఈ కార్పొరేట్ చదువుల్లో ఎంత సంఘర్షణ అనుభవిస్తున్నారు. రాయడానికి ఎంతో విశాలమైన ప్రపం చం ఉన్నది. రచయితలు కొత్త దారులు తొక్కాలి. పుస్తకాలకు దూరమై, టీవీ, సెల్ ఫోన్లకు బానిసలవుతున్న బాలలను మనవైపు మలుచుకునే మంచి రచనలు రావాలి’
అని సూచించారు. బాలసాహిత్య రచయితలు ఆ దిశగా కలాన్ని కదిలిస్తారని ఆశిద్దాం.
– పుప్పాల కృష్ణమూర్తి