రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విద్యారంగ సంస్కరణల పేరుతో వింత పనులతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఆర్భాటపు హడావుడి తప్ప, ఆచరణాత్మక ప్రణాళికలను అమలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆరుట్ల మరోసారి వంచనకు వేదికైంది. విద్యారంగంలో మార్పుల పేరుతో ఇప్పటికే ఆరుట్ల పేరును కాంగ్రెస్ పాలకులు వాడుకున్నారు. తాజాగా ఈ పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిల్లలకు అల్పాహారం పంపిణీ ప్రారంభానికి కూడా ఆరుట్ల పాఠశాలనే మరోసారి వేదిక చేశారు.
ఆరుట్ల పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు ప్రయోగాత్మక మాడల్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. అదిగో అక్కడే అసలు తిరకాసు ఉన్నది. తెలంగాణ విద్యా వ్యవస్థ సంస్కరణ పేరిట ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తెలంగాణ విద్యా సంస్కరణ పేరిట 355 పేజీల నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆ నివేదికను ప్రభుత్వం మూలకు పడేసింది. తెలంగాణ విద్యా కమిషన్, గత బడ్జెట్‌కు ముందే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రూ.31,500 కోట్ల అంచనాతో చేపట్టాల్సిన చర్యలను సూచించింది. మండలానికి నాలుగు ఫౌండేషన్ స్కూల్స్, మూడు పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని తెలిపింది. వంద నియోజకవర్గాల్లో 400 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ బడ్జెట్లో విద్యారంగానికి 8.2 శాతం మాత్రమే నిధులు కేటాయించింది. తెలంగాణ విద్యా ప్రణాళికలో ఆరుట్ల స్కూల్‌ను సక్సెస్ మాడల్‌గా పొందుపర్చారు. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గురించి ముఖ్యమంత్రి మాటమాత్రంగా కూడా స్పందించలేదు. పాఠశాల పునఃప్రారంభానికి కొన్ని రోజుల ముందు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పదవికి రాజీనామా చేశారు. ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటనపై ఉపాధ్యాయ, ప్రజాసంఘాల ప్రతినిధులు తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రత్యామ్నాయం ఏంటో స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వ బడులు ఎలా మూసివేస్తారు? అనేది ప్రశ్న.
బడుల మూసివేత ఎందుకు, పేద పిల్లల చదువుల సంగతేంటి? అనేది చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి ఆరుట్ల పాఠశాలనే తన ప్రచార వేదికగా ఎంచుకున్నారు. విద్యార్థులకు అల్పాహారం అందజేసే కార్యక్రమాన్ని అక్కడే ప్రారంభించారు. అక్కడి వేదికపై మాట్లాడుతూ ఆరుట్ల స్కూల్‌ను పబ్లిక్ స్కూల్ మాడల్‌గా అభివృద్ధి చేస్తామని అన్నారు. అక్కడే అసలు విచిత్రం ఉన్నది. అప్పట్లోనే ఆరుట్ల స్కూల్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ మాడల్ అంటూ అసెంబ్లీ వేదికగా చూపించారు. మళ్లీ ఆరుట్లను ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తాం అనే మాట చాలా చిత్రంగా అనిపించింది.
మరో ముఖ్య విషయం ఏమిటంటే రాజీనామా చేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కూడా ఆరుట్ల సభా వేదికపై కనిపించారు. ఆ సభకు రెండు రోజుల ముందు కాక్రోచ్ జనతాపార్టీ సభలో ఆకునూరి మురళి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు చేశారు. కానీ ముఖ్యమంత్రి సభలో పాల్గొని, ఆహా ఓహో అంటూ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. అసలు ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందా లేదా? అనేది స్పష్టతలేదు. విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంటే విద్యాకమిషన్ చైర్మన్ ఎందుకు పూటకో మాట మాట్లాడుతున్నట్టు? ప్రభుత్వ బడులను మూసివేసి, ప్రైవేట్ పాఠశాలల అడ్డగోలు దోపిడీకి తెరతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కానీ ఇదంతా కప్పిపుచ్చేందుకు పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కూల్స్ అంటూ ఆర్భాటపు ప్రచారాన్ని వాడుకొంటున్నది. అంతే తప్ప రెండున్నరేండ్ల పాలనలో సాధించిన ఫలితాలు మాత్రం ఏమీలేవు. కానీ కోట్లాది రూపాయలు మాత్రం ఖర్చు అవుతూనే ఉన్నాయి.
పాఠశాలల సంస్కరణ ప్రచారం సంగతి సరేసరి. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం ఉన్న పళంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే ప్రైవేట్ విద్యా వ్యవస్థ నెత్తిన పాలుపోసినట్టే అవుతుంది. ప్రైవేట్ విద్యా వ్యవస్థ నియంత్రణ తర్వాతనే ప్రభుత్వ బడుల సంస్కరణపై దృష్టి పెట్టాలి. ఆ పని రేవంత్‌రెడ్డి చేయగలరా? అయితే పబ్లిక్ స్కూల్ ముసుగులో బడుల మూతకు రంగం సిద్ధం చేస్తున్నారా? ఏదీ ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ ఆరుట్లను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు ప్రయోగాత్మక మాడల్ అనడం మాత్రం చాలా విచిత్రంగా ఉన్నది. రెండున్నరేండ్ల పాలనలో విద్యా సంస్కరణలు మాటలకే పరిమితమయ్యాయి. నిరుడు సుమారు 4వేల ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. ఈ ఏడాది ఇంకెన్ని పాఠశాలలకు మంగళం పాడుతారో తెలియదు. కామన్ స్కూల్ విధానం ద్వారా ఉన్న పాఠశాలలనే తెలంగాణా పబ్లిక్ స్కూల్స్‌గా మార్చాలి. ప్రభుత్వ బడి సంస్కరణల విషయంలో మాటలతో సరిపెట్టకుండా ఆచరణాత్మకంగా చర్యలు చేపట్టాలి. అంతేకానీ ప్రభుత్వ బడుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ విద్యా వ్యాపారానికి మరింత ఊతమిచ్చేలా వ్యవహరిస్తే చరిత్ర క్షమించదు.