e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఎడిట్‌ పేజీ శాసనంలో వంశ చరిత్ర

శాసనంలో వంశ చరిత్ర

గంగాధర మంత్రి వంశచరిత్ర తెలిపే కరీంనగర్‌ శాసనం విశేషమైంది. తెలుగు ప్రాంతాలను ఏకచ్ఛత్రాధిపత్యం కింద పాలించిన కాకతీయులు చక్కని పరిపాలనను అందించారు. వారి మంత్రులలో గంగాధర మంత్రి విశిష్టమైనవాడు. ఇతను కాకతీయ రుద్రదేవ మహారాజు మంత్రిగా అనేక సత్కార్యాలు నిర్వహించాడు. ఆయన వేయించిన సంస్కృత శాసనాలతో పాటు కరీంనగర్‌లో ఒక తెలుగు శాసనం కూడా ఉన్నది. ఈ శాసనకాలం శ.సం.1092 = క్రీ.శ.1171. వికృతి సంవత్సరం మాఘ శుద్ధపంచమి.

శాసనంలో వంశ చరిత్ర

శాసనంలో గంగాధర మంత్రి, వారి పూర్వ వంశీయుల గురించి విపులమైన వర్ణన ఉంది. గంగాధర మంత్రి పూర్వికులు వేంగి దేశంలోని వెల్లంకి గ్రామానికి చెందినవారు. అత్రి గోత్రోద్భవులైన వీరి వంశంలో కొమ్మనార్యుడు జన్మించాడు. అతని కొడుకు నారాయణెడె, మనవడు గోవిందుడు. గోవింద, తురుకమాంబలకు ‘భూధర ధైర్యుడు, అత్యధిక పుణ్య చరితుడు, అపార కీర్తి లక్ష్మీ ధర్మమూర్తి, శిష్టజన మిత్రుడు, గోత్ర పవిత్రుడు అచ్యుతారాధన తత్పరుండు, సురరాజ గురుండు, అతి ప్రభాతియై గంగాధరుడు’ జన్మించినాడట. చిన్నతనం నుంచి చురుకుగా ఉండే గంగాధరుడు అన్ని విద్యలను అభ్యసించి సమస్త జనావళి సభలలో ఇతని సద్గుణాలను ప్రస్తుతించే విధంగా ఉండేవాడట.

ధరణిలో అత్యుత్తమమైన తీర్థము శివస్థానం సంవర్తకేశ్వరమని భావించి శశిఖండ శేఖరుని పూజించి తటాకాన్ని, గుడిని ప్రతిష్ఠించి జగద్వంద్యుడైన భవానీపతిని పూజించినాడట. మంత్రకూట పురములో జగజ్జనాభివందిత చరణాంబురుహునికి ఆచంద్రార్క స్థిరంగా గుడి వ్రిత్తి నిల్పినాడట.

గంగాధర మంత్రి ఆయా ప్రదేశాల్లో చేసిన ఆలయాల ప్రతిష్ఠలను గురించి వివరణంతా స్వయంగా తాను చెప్పుకున్నట్లుగానే శాసనంలో పద్యాల రూపంలో ఉంది. ఇందులో సప్త సంతానాల విషయం కూడా ప్రస్తావితమైంది. (తను పెంచిన సంతానం, తన సంతానం, కృతి, తన నల్లిల్లు (అగ్రహారం), వనం, చెరువు, గుడి ఇవి సప్త సంతానములుగా చెప్పబడినవి).
‘శ్రీ కాన్తా కాన్తుచే నాశ్రిత విబుధ జనాభిస్థిర ప్రాజ్య
శ్రీ కాన్తా కాన్తుచే విస్త్రిత నిజ భుజ నిస్త్రింశ నీతాన్య రాజ
శ్రీ కాన్తా కాన్తుచే దిక్‌క్షితి గగన సమాశ్లిష్ట విస్పష్ట కీర్తి
శ్రీ కాన్తా కాన్తుచే నూర్జిత రిపుమ్రిగ రాజీమ్రిగారాతి చేతన్‌’ అంటూ కాకతీ రుద్రదేవ మహారాజు ప్రశంస కూడా ఈ శాసనంలో విపులంగా ఉంది.
గంగాధర మంత్రి రాచకార్యాలలోనే కాక సారస్వత విషయాల్లో కూడా గొప్పవాడని ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. శాసన రచయిత పేరు ప్రత్యేకంగా పేర్కొనక పోయినప్పటికీ తాను చేసినట్టుగా శాసనంలో చెప్పుకున్న విధానం ఈ శాసన రచయిత గంగాధర మంత్రే అని ఊహించవచ్చు.

  • డాక్టర్‌ భిన్నూరి
    మనోహరి
    9347971177
Advertisement
Previous articleఅమ్మ
Next articleవాస్తు
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శాసనంలో వంశ చరిత్ర

ట్రెండింగ్‌

Advertisement