తెలంగాణ తరతరాల చరిత్రలో రాజవంశాల పాలనా విశిష్టత ఎంత గొప్పదో, సాహితీ సృజన సంపద కూడా రాశిలోనూ, వాసిలోనూ అంత గొప్పది. కాకతీయులు మొదలు.. గద్వాల, దోమకొండ సంస్థానాల దాకా నాటి పాలకులు జనరంజక పాలన అందించటంలోనే కాదు, చరిత్రలో నిలిచిపోయే సాహితీ సృజనకు కూడా కారకులయ్యారు. ముఖ్యంగా దోమకొండ సంస్థానాదీశుల సాహిత్య సేవలు తెలంగాణ కీర్తిపతాకను చాటిచెప్పటంలో మైలురాళ్లుగా నిలుస్తున్నాయి.
తెలంగాణలో ఐదు శతాబ్దాల పాటు సాహితీ వైభవంతో వెలిగిన సంస్థానాలలో దోమకొండ ఎన్నదగింది. ఈ సంస్థానం మొదటి కాచారెడ్డి (1415-1450)తో ప్రారంభమై, రెండవ సోమేశ్వరరావు (1940-1949)తో ముగిసింది. తొలి పాలకుడైన మొదటి కాచారెడ్డి ‘సుధీలోకాను-రక్షాకరుడు’ (విద్వత్కవులను ఆదరించినవాడు) అనే కీర్తిని గడించినట్లు ‘పద్మ పురాణం’ అనువాదంలో కామినేని మల్లారెడ్డి పేర్కొన్నాడు. ఈయన తర్వాత మొదటి ఎల్లారెడ్డి (1500-1525) గోన బుద్ధారెడ్డి వలె సప్త సంతానాలతో ప్రశస్తిని పొందాడని, రేచర్ల సింగభూపాలుని వలె ‘మహిత సర్వజ్ఞతా మహిమతో మెరిశాడని పట్టమెట్ట సోమనాథ సోమయాజి బ్రహ్మోత్తర ఖండానువాదంలో ప్రశంసించాడు. ఇతడే బాలభారత, కిరాతార్జునీయ కావ్యాలను అంకితంగా స్వీకరించి వెలుగొందాడని ఈ పురాణంలో ఉన్నది.
చినకామిరెడ్డి అగ్రజుడైన జంగమరెడ్డి (1600-1640) ‘సత్కవివర్యకోటికిన్ బంగరుకొండ’(సత్కవుల పాలిట బంగా రు కొండ)గా సూత సంహితానువాదంలో కీర్తితుడైనాడు. రెండ వ ఎల్లారెడ్డి బ్రహ్మోత్తర ఖండాన్ని అనువదించుమని పట్టమెట్ట సోమనాథకవిని కోరాడు. ఇతని ఆస్థానంలో వేదాలు, శాస్ర్తాలు, పురాణేతిహాసాలు తెలిసిన కవి పండితులెందరో ఉండేవారు. రెండవ కామిరెడ్డి కనిష్ఠ సోదరుడు మల్లారెడ్డి గొప్ప కవిగానూ, కవి పండిత పోషకునిగానూ వెలుగొందాడు. ఇతడు ‘శివధర్మోత్తరం’, ‘బ్రహ్మోత్తర ఖండం’, ‘సూతసంహిత’, ‘పద్మ పురాణం’, ‘వాసిష్ఠలైంగం’, ‘బాలభారతం’, ‘కిరతార్జునీయం’, ‘షట్చక్రవర్తి చరిత్ర’ వంటి ఎన్నో ప్రబంధాలు రాశాడు. ఇతడు తన వంశాన్ని గూర్చి శివధర్మోత్తరంలో ఇలా వర్ణించాడు.
‘ఎనయన్ సోమకులంబునందు భరతుండింపొంద జన్మించ నాతని పేరందగి భారతాన్వయమునాద్కళొత్తురీతిన్శుభాయనమౌ రాచుళ గోత్రమందు జననంబాకామినేడందనా ఘనుపేరందగి కామినేన్కుల మనంగా మించెనుర్వీస్థలిన్’
చంద్రవంశంలో పుట్టిన భరతుని వల్ల భరతవంశం ఎలా వెలుగొందిందో, అలాగే రాచుళ్ల గోత్రంలో కామినీడు వలన ఖ్యాతిగాంచిన కామినేనివంశ కీర్తి ప్రతిష్ఠలతో విరాజిల్లిందని చెప్పాడు.
దోమకొండ సంస్థానంలో సాహిత్యవైభవం మూడు దశలలో సాగింది. 1550-1600 మధ్యన తొలిదశలో పట్టమెట్ట సోమనాథ సోమయాజి ఈ సంస్థానంలో విద్వత్కవిగా విరాజిల్లాడు. ఇతర సూత సంహిత, బ్రహ్మోత్తర ఖండాలను తెలుగులోకి అనువదించి శ్రీకారం చుట్టాడు. ఇతని సమకాలంలోనే కామినేని మల్లారెడ్డి ‘షట్చక్రవర్తి చరిత్ర’, ‘శిశధర్మోత్తరం’, ‘పద్మ పురాణా’లను తెలుగులో ప్రబంధాలుగా తీర్చిదిద్దాడు.
రెండవ దశలో 1715-1765 ఏండ్ల మధ్య ఈ సంస్థానాన్ని ఆశ్రయించిన రాపాక లక్ష్మీపతికవి రామారెడ్డి పేటలోని శివ, రామక్షేత్రాల వైభవాన్ని ‘భద్రాయురభ్యుదయం’, ‘శ్రీకృష్ణ విలాసాల’లో తీర్చిదిద్దాడు. మూడవ దశలో 1900-1949 మధ్యకాలంలో ఆదిపూడి ప్రభాకర కవి కామినేని వంశ చరిత్రను ‘ఉమాపత్యభ్యుదయం’ పేరుతో కావ్యంగా రచించాడు. ‘రామేశ్వర విలాసం’ అనే ప్రబంధాన్ని కూడా వెలయించాడు. ఈ కాలంలోనే పెద్దమందడి వేంకటకృష్ణకవి ఈ వంశంలోని ప్రధితకీర్తి అయిన రాజవ్వగారి జీవిత చరిత్రకు కావ్యంగా మలిచాడు. వీరేకాకుండా సంస్కృత కవులు, శాస్త్రకారులు కూడా ఆస్థానంలో వెలిగారని తెలుస్తున్నది.
1681లో మిట్టపల్లి సీతారామసూరి అనే జ్యోతిషపండితుడు ‘కాలనిర్ణయ చంద్రిక’ అనే సంస్కృత గ్రంథాన్ని రాశా డు. మిట్టపల్లి నృసింహసూరి అనే విద్వాంసుడు ‘ఆచారదీపిక’ అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. వీరేకాకుండా, పెద్ది భట్టు (1606), మిట్టపల్లి మృత్యంజయావధాని (1870) వంటి విద్వాంసులెందరో సంస్కృత సాహిత్యసేవ చేశారు. తిగుళ్ల రామచంద్ర ప్రావధాని అనే పండితుడు ‘బాలసరస్వతి’లా వెలిగాడని ఈ వంశచరిత్ర చెప్తున్నది. తిగుళ్ల లింగన్న ధర్మశాస్త్ర నిర్ణయకారునిగా వాసికెక్కాడు.
ఈ సంస్థానం బిక్కనవోలు (ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు)లోని శ్రీ సిద్ధ రామేశ్వరక్షేత్రాధిదేవత అయిన సిద్ధరామేశ్వరుని కృపాకటాక్షాలతో పరిపాలించినట్లు చరిత్ర చెప్తున్న ది. విజయనగర పాలన విరూపాక్షుని కరుణతో సాగినట్లు, ఈ సంస్థాన పరిపాలన సిద్ధారమేశ్వరుని ఆజ్ఞతో కొనసాగేదని తెలుస్తున్నది. ఈ సంస్థాన పాలనలో మూడు రాజధానులు కనబడుతాయి. బిక్కనవోలు (బిక్కనూరు) తొలి రాజధానిగా ఈ వంశపాలన 1415-1715 వరకు సాగగా, రథాల రామారెడ్డిపేట రెండవ రాజధానిగా 1715-1765 మధ్యన కొనసాగింది. చివరి రాజధాని 1765లో దోమకొండకు చేరింది. 1949 దాకా దోమకొండ పాలనా నగరంగా కొనసాగిన తర్వాత ఈ వంశపాలన ముగిసింది.
రేపాక లక్ష్మీపతి కవి రచించిన ‘శ్రీకృష్ణ విలాసం’ అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’ వలె ఎంతో రమణీయ వర్ణనలతో కనబడుతుంది. ఈ కవి రామారెడ్డి పురాన్ని వర్ణించిన ఈ పద్యం సహృదయ మనోహరం.
‘శ్రీమచ్చందిర సుందరో పలనభస్పృక్ సౌధవీథ్యాపగ శ్యామోద్యత్కుచకుంభ సంభరిత గంధామోదనామోదితా భౌమద్వీప్వతీ సరోజ కుహరభ్రామ ద్విరేఫంబు, శ్రీ రామారెడ్డిపురంబు రంజిలు రమారామాభి రామాకృతిన్’
కామినేని మల్లారెడ్డి ఈ వంశంలో ప్రభవించిన కవిరత్నంగా భాసించాడు. ఇతనిని రాజకవి (పాలకుడై ఉండి కూడా కవిగా రాణించినవాడు), కవిరాజు (కవులందరిలో మేటికవిగా విరాజిల్లాడు) అని కొనియాడవచ్చు. ఇతడు ప్రజల జీవన విధానాన్ని ఎంతగా ఆకళింపు చేసుకొన్నాడో తెలుపడానికి షట్చక్రవర్తిలో చరిత్రలోని ఈ పద్యం ఉదాహరణగా నిలుస్తుంది. ఈ పద్యం నలమహారాజు కథలో వసంతాగమన సూచనను తెలిపే పద్యం అయినా, వసంతుడు ఒకరైతులా కనబడుతున్నాడని వర్ణించడం మల్లారెడ్డి సమాజ దర్శనానికి అద్దం పడుతున్నది.
‘తరువుల పండుటాకులు పదంపడి వెళ్లగదున్ని పల్లవోత్కరపటు బీజముల్మునుపు దట్టముగా వెదవెట్టి కోయిలల్గరిమను గల్పుదీయ జలిగాడ్పుల గావలియుంచి, పుష్పమం జరులొగి రాశి చేసెను వసంత కృషీవలుడవ్వనస్థలిన్’
ఇలా దోమకొండ సంస్థానం ప్రాచీనకాలంలో తెలంగాణలోని సాహితీ వైభవాన్ని చాటుతూ, నేటి కవులకూ, విద్వాంసులకూ సాహిత్య సంపదలను అందిస్తున్నది.
– డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
94404 68557