Bathukamma | బతుకమ్మ ఆదివాసీల వారసురాలు. అడవిలో పుట్టే చెట్లు, పూలు ఇలా ప్రకృతి ప్రతిరూపం బతుకమ్మ. ఆటవికులు, ఆదివాసులు, గిరిజనులకు మొలకలను, పూలను కొలిచి పూజించే ఆచారం ఉండేది . పూలను ప్రకృతి మాతగా బతుకునిచ్చే అమ్మగా కొలిచేవారు. రెండవ శతాబ్దంలోని బౌద్ధ చరిత్ర తిరగేస్తే హరిత అనే దేవతను తమ సంతానాన్ని చల్లగా చూడమని ప్రార్థించే వారని. ఆమె పిల్లలకు బతుకునిచ్చే అమ్మగా మారిందని ఓ కథ. అలాగే జైనులు వారి దేవత కూష్మండిని బతుకమ్మ అంటారని పురాణాలు చెప్తున్నాయి.
పూర్వం వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెంద ని కాలంలో మహిళలు ప్రసవించడం అంటే బతుకుతో పోరాటమే. ఆ కాలంలో మహిళల ప్రసవాలు చాలా కష్టతరంగా ఉండేవి. బిడ్డ పుట్టడం, పుట్టినా బతికి బట్టకడుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అలా అదృష్టంతో పుట్టిన బిడ్డకు ‘బతుకమ్మ’ ‘బతుకు’ అమ్మా అని, పిల్లాడయితే ‘బతుకయ్యా’ అని పేర్లు పెట్టుకునే వారు. అలా తమ పిల్లలకు బతుకునిచ్చిన అమ్మ బతుకమ్మగా ఈనాటికీ పూజలందుకుంటున్నది.
కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరుని ఆలయంలోని శివలింగాన్ని తొలగించి తంజావూరు రాజు తన తండ్రికి కానుకగా ఇచ్చాడు. దీంతో పార్వతి (బృహదమ్మ) ఒంటరి అయ్యింది. ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలు బృహదమ్మకు పూలు పేర్చి పాటలు పాడి పూజించటం మొదలు పెట్టారట. ఆ బృహదమ్మనే బతుకమ్మ అయిందని మరో కథనం ఉన్నది.
బతుకమ్మ అసలు సిసలైన తెలంగాణ షాన్. బతుకమ్మను తంగేడు, జిల్లేడు, పున్నాగ , రుద్రాక్ష, గునుగు, గోరింట, తామర పువ్వులు ఇలా అనేక రకాల పూలతో పేరుస్తారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పాడే పాటలన్నీ బతుకు పాట లే. ప్రతి పాటలో ఆనాటి సమాజం, మహిళల జీవన విధానం ప్రస్ఫుటమవుతుంది. ఆ పాటల్లో నాటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారా లు, ఆటలు, అలకలు, ప్రేమానుబంధాలు అన్నీ ఉంటాయి.
అణగారిన వర్గాలలోనే పుట్టిన బతుకమ్మ పెత్తందారి తనంతో పోరాడింది. గిరిజనుల ఆరాధ్యదేవతగా ఉన్న బతుకమ్మ ఆ తర్వాత అగ్రవర్ణాల పండుగగా మారిందంటారు. దీంతో దళిత, గిరిజనులు బతుకమ్మను పూజించే హక్కును కోల్పోయినట్టు చెప్తారు. అయితే ఇప్పుడిప్పుడే గిరిజన మహిళలు కూడా బతుకమ్మ మా అమ్మ అంటూ తొమ్మిదిరోజులు గౌరమ్మను అలంకరించి వేడుక చేసుకుంటున్నా రు. బతుకమ్మ మహిళా శక్తి. పూలల్లో, పాటల్లో, ప్రకృతిలో మమేకమైన బతుకమ్మ మహిళలకు స్ఫూర్తి. అమ్మ దీవెన స్త్రీలకు రక్ష.
రాజీవ