మరణమైనా జననమైనా ఆదర్శంగా కదిలిన నాడువాళ్ల స్మృతులన్నీ పరిమళమై పూస్తూనే ఉంటాయి
బ్రిటీషు కాలమైనా కాకతీయ కాలమైనా కష్టకాల మొచ్చి కప్పంను నిరసించే ధిక్కార స్వరం బాధిత జనాన్ని హత్తుకుంటుంది
మనుషులు మనుషులుగా లేని చోట మహోన్నతంగా మెదిలి అడవి బిడ్డల కోసం ఆత్మార్పణలు చేసినోల్లంతా దేవతల కంటే ఎక్కువే.. అహంకార భావ జాలంపై పిడికిలెత్తి పోరాడిన యోధులంతా నిత్యం స్మరించుకునేఇలవేల్పులే కదా మన మేలు కోసం బతుకంతా యుద్ధం చేసినోళ్ళ కోసం మనమంతా నిలువెత్తు బంగారమై కొలుచు కోమా..
ఇప్పుడైనా ఎప్పుడైనా నేటితరం భావితరం స్థల పురాణం సందేశాలను స్మరించుకోవాలి సమ్మక్కో, సారలమ్మో నీకు ఆదర్శం కావచ్చు ఏ మన్యమైనా మణిపూర్ అయినా అన్యాయపు డొక్కల్ని చీల్చటానికి ఆదిశక్తి అవతార మెత్తాలి చరిత్ర పాఠాలతో గుణపాఠాలు నేర్వాలి
గిరిజన హక్కుల నినాదమో
మహాజన మొక్కుల అభివాదమో
నువ్వు తల దాచుకునే గుడారమో
నువ్వు తల ఎత్తుకునే మేడారమో
దట్టమైన చిలుకల గుట్టో
కష్టమైన పలుకుల మెట్టో
నీకు గుండె నిండా నిబ్బర మివ్వొచ్చు
మనసును ప్రశాంతం చేసుకుని సంపెంగ వాగులో స్నానమాడు హృదయమంతా… వీరత్వం తో గుబాళిస్తొంది…
– డాక్టర్ కటుకోఝ్వల రమేశ్ 9949083327