అదిలాబాద్ జిల్లాకు ఇద్దరు సరస్వతులు. ఒకరు బాసర సరస్వతి అయితే మరొకరు పుంభావ సరస్వతి సామల సదాశివ. ఈ పేరు వినగానే అదిలాబాదు అడవి బిడ్డలు మా మాస్టారు అంటారు. ఏ భాషలో ఎవరికి ఉత్తరం వచ్చిన పరుగున పంతులు గారి దగ్గరికి వచ్చి చదివించుకునేవారు. ఖానూన్ కాగితాలైన, కోర్టు నోటీసులైనా వారి నోట పలికితే బాసర చదువులమ్మ భరోసా ఇచ్చినట్టని వారి నమ్మకం. ఆయన ఏడు భాషలు తెలిసిన బహుభాషావేత్త. అతి నిరాడంబరమైన జీవితశైలి ఆయనది. ఆయన రచనలు చదువుతుంటే ఆత్మీయుల ముందు కూర్చుని ముచ్చటిస్తున్నట్టుంటుంది. మహోపాధ్యాయుల బోధనల నుండి నేర్చుకోవడానికి కృషిచేసిన నిరంతర సాహిత్య విద్యార్థి. సమస్యను గాని, సాహిత్యాన్ని గాని విమర్శనాత్మక దృష్టితో పరిశీలించడం నమ్మినదానిపై గట్టిగా నిలబడటం ఆయన తరీఖా.
మనిషి చనిపోవడం, బతికి ఉండటం సమ స్య కాదు. ఒక నిజంలా.. ఒక ఉద్యమంలా.. ఎందరు బతుకుతున్నారన్నదే నేడు అసలు సమస్య అని చెప్పి, పాటించిన కలం యోధుడతడు. ఆ సాహిత్య సాగరుని రచనల్లో సరళత, స్పష్టత, సహజత్వం ఉట్టి పడతాయి. వివిధ పార్శాలు తొంగిచూస్తాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, హిందుస్తానీ సంగీతాన్ని తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత ఆయనే. తెలంగాణ అంటే ఒక పోరాటం.. ఇక్కడి ప్రజలు పోరాటాలకు సంకేతం అని చాటిచెప్పిన సాహిత్య ధ్రువతార. భాష ఏదైనా భావవ్యక్తీకరణ పరమావధిగా బహుభాషా పరిమళాలను వెదజల్లినవారు. సామల సదాశివ మాస్టారు అదిలాబాదు అడవి బిడ్డలకు తండ్రి వంటివారు.
నైజాం సర్కారును మట్టి కరిపించిన పోరు కేంద్రం దహేగావ్ మండలం తెలుగు పల్లెలో 1928 మే 11న నాగయ్య చిన్నమ్మ దంపతుల బిడ్డగా కన్ను తెరిచారు. వారిది చేనేత కార్మిక కుటుంబం. చిన్నప్పటి నుంచే అసమాన ప్రతిభ కనబరిచిన సదాశివ అసిఫాబాద్, కాగజ్‌నగర్, వరంగల్‌లో చదువుకున్నారు. ఎంఏ, బీఈడీ, డి.లిట్ పూర్తి చేసిన సదాశివ 1954లో టీచరుగా జీవితం ప్రారంభించారు. ఆసిఫాబాద్ వాంకెడ, సిర్పూర్‌లలో పనిచేసిన తర్వాత భద్రాచలంలో ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. చిన్ననాటి నుండే తన రచనా ప్రస్థానం సాగించారు.
ఉర్దూ మీడియంలో చదువుకున్న సదాశివకు తెలుగుతోపాటు సంస్కృతం, మరాఠీ, పార్సీ, హిందీ, ఇంగ్లిష్ భాషలపై మంచి పట్టు ఉంది. ప్రభాతం నిరీక్షణం, మంచి మాటలు, ఆర్తి, సాంబశివ శతకం లాంటి అపూర్వ పద్య సాహిత్యాన్ని సృష్టించారు. అవన్నీ భారతి పత్రికలో ప్రచురితమయ్యాయి. దీంతో వేలూరి శివరామశాస్త్రి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రితో సహా అనేకమంది ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. మరాఠీ, పార్సీ, హిందీ ఇంగ్లిష్ సాహిత్యాలు తెలిసినవాడివి కనుక తెలుగు సాహిత్యానికీ వాటిని పరిచయం చేయమన్న సురవరం ప్రతాపరెడ్డి సూచనతో సదాశివ కలం విదిల్చారు. ఏడు భాషలపై తనకున్న పట్టుతో వచన రచన, అనువాదం వంటి ఎన్నో ప్రక్రియలు చేశారు. అనేకమంది తెలుగు కవులను ఉర్దూవారికి, ఉర్దూ సాహిత్య చరిత్రను తెలుగులోకానికి పరిచయం చేశారు. ఇందుకోసం దాదాపు 300 వ్యాసాలను ఉర్దూలోనూ, 450 వ్యాసాలను తెలుగులోనూ రాశారు. సియాసత్ పత్రికలో రాసిన వ్యాసాలతో పాటు గొప్పకవిగా ఉన్న కాళోజీ రామేశ్వరరావును లోకానికి పరిచయం చేశారు. అంతేకాదు, తెలంగాణ మేధావి జయశంకర్ సార్‌కు ఉర్దూ భాష పై ఉన్న పట్టును తరచుగా తన వ్యాసాలలో పరిచయం చేశారు. జయశంకర్ సార్ తానే ఒక నిఘంటువు అయినప్పటికీ ఏదైనా సందేహం వస్తే సదాశివ గారిని అడిగేవారు. దానికి ఆయన సునాయాసంగా అనేక వివరాలతో సహా విప్పి చెప్పేవారు.
సామల సదాశివ పేరు వినగానే మనకు మలయ మారుతాలు, సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు గుర్తుకొస్తాయి. ఇంకా అమ్జద్ రుబాయిలు, ఉర్దూ సాహిత్య చర్చ, మౌలానా రూమీ మస్నవీ వంటి ఉర్దూ కవుల కవితలు, మీర్జా గాలిబ్ రచనలు కూడా యాదికొస్తాయి.
ఆయన రచనల్లో ఎన్నో కొత్త విషయాలు గోచరిస్తాయి. ఆమూలాగ్రం చదివిస్తాయి. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకపోయేటట్టు చెప్పడం ఆయనకున్న ప్రత్యేకత. మాట సూది, మనసు దూది. అతని భాష, శైలి చాలా సహజసుందరంగా ఉంటాయి.
ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హిరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియాఖాన్, బేగం అక్తర్, గంగుబాయి హంగల్, కేసర్ బాయ్.. ఇలా ఎందరో సంగీత విద్వాంసులు ఆలపించే విధానాలను సదాశివ మనకు చక్కగా వివరిస్తారు. మనకు హిందుస్తానీ సంగీతం పట్ల అభిరుచిని కలిగిస్తారు. ఉర్దూ భాష మాధుర్యాన్ని రుచిచూపిన అగ్రగణ్యులు వారు. ఆయన సాహిత్య కృషితో పాటు పెద్దవారితో చిన్నవారితో వారేర్పర్చుకున్న సన్నిహిత ప్రేమానురాగాలు కూడా ఉదాత్తమైనవి.
ఆయన మంచి చిత్రకారుడు కూడా. నాటకాలకు అవసరమయ్యే పరదాలను చిత్రించడం, తమ కవితలకు తగిన బొమ్మలు గీయడం, ముఖాకృతుల చిత్రాలు వేస్తుండేవారు. ప్రసిద్ధ చిత్రకారులు కాపు రాజయ్య తన తొలిదశలో సారు దగ్గర చిత్రకళలో మెలకువలు నేర్చుకున్నారట. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనకు అన్ని వర్ణాల, వర్గాలవారితో, అన్ని వాదాల వారితోనూ, అన్ని ప్రాంతాల వారితోను సత్సంబంధాలు ఉండేవి. ఆకాశవాణిలో ఆయన చేసిన ప్రసంగాలు ఎందరో రసజ్ఞులైన శ్రోతల నలరించాయి. తొణుకు బెణుకు లేని ఆయన కంఠస్వరం సహజ సుందర శైలిలో సాగేది. తెలంగాణ ఆత్మాభిమానం స్వయంకృషి సృజనాత్మకత వీటన్నింటిని కలిపి ముద్దచేసి దానికి ఒక ఆకారమిస్తే తయారయ్యే మూర్తి సామల సదాశివ. రచన ఆయన వృత్తి, ప్రవృత్తి కాదు.. జీవితంలో భాగం. గాలి పీల్చడం, ఆహారం తినడం ప్రాణికి ఎంత సహజమో రాయడం చదవడం కూడా ఆయనకు అంతే సహజం. ఏనాడూ అవార్డులకు ఆశపడలేదు. కానీ అవన్నీ ఆయన్ని వరించి వచ్చా యి. మాటలకందని మహనీయుడు, తెలంగాణ వైతాళికులలో ఒకరైన డాక్టర్ సామల సదాశివ మాస్టర్ 2012 ఆగస్టు 7న కన్నుమూశారు. ఆయన యాది మనకు మిగిల్చిపోయారు. నిను మరువం సదా.. శివా!
– భూపతి వెంకటేశ్వర్లు 9490098343