‘అల్లం మురబ్బా’ అని కేక వినబడగానే
నోటిలో నీళ్లూరుతాయి.
చతురస్రాలు, త్రికోణాలు
గుండ్రటి బిళ్లలను
ఒక ట్రేలో పేర్చుకొని
పొద్దున్నే బయల్దేరుతాడు.
ఒక్క ముక్క నోట్లో వేసుకోగానే
అల్లం రసం, తేనె పాకంలోని జమిలి రుచి
కళ్లలో వెలుగుతుంది.
మురబ్బాలమ్ముకుంటూనే
ఇద్దరు బిడ్డల పెండ్లి చేశాడు
ఓ పిల్ల కేసు కోర్టులో నడుస్తుంది
ఆ తడబాటు
అతని అడుగుల్లో తెలుస్తుంది
ఇవాళ అతని కేకలో మునుపటి పదును లేదు.
నిజాం జమానా నుంచి
నేర్చుకున్న ఈ వృత్తి
ఇవాళ నత్తి మాటలు మాట్లాడుతుంది.
కొనేవాళ్లు బేరమాడుతారు గాని
పడదు పడదని ముందుకెళ్తాడు
ఉద్దెరకివ్వడు
వాకింగ్ నుంచి తిరిగి వస్తుంటే
నా దారికి అడ్డం పడతాడు.
ఈ మధ్య పది రోజులుగా
అతడు కనపడటం లేదు
ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి
వాకబు చేశాను గాని
ఊరు విడిచి
వెళ్లిపోయాడని తెలిసింది.
అల్లం మురబ్బా రుచి
నా నషాళంలో
అలాగే మిగిలిపోయింది.
అయితే అతడు
మరో వృత్తిని వెతుక్కున్నందుకు
సంతోషించాన్నేను.
– డాక్టర్ ఎన్.గోపి