శ్రీనాథ శర్మగారి శ్లోకాలన్నీ పదలాలిత్యం అంత్యానుప్రాసలతో హాయిగా పారాయణం చేసేవిధంగా ఉంటాయి .
గోదావరి సజీవధారగా తెలంగాణ సీమకు భాగ్యదాయినిగా మారి కాళేశ్వరం మొదలు అనేక ప్రాజెక్ట్‌లతో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను శ్లాఘిస్తూ, నీటికష్టాలు, కన్నీళ్లు తెలిసిన కవి కనుక తమ తండ్రి తాతలు ఊహించని గోదావరీ జలాల ఎత్తిపోతల జలజలలు, కాలువల ద్వారా నీళ్ల పరవళ్ళు, జలాశయాలు చూసిన శ్రీనాథ శర్మ హృదయంలో పొంగిన కవితా గంగావతరణమే ‘గోదావరి ద్వాదశి’. అందులో మచ్చుకు..
కాళేశ్వర ప్రథిత సేతు వినిర్మి తాస్యామ్ శ్రీమత్ తెలంగ జన మోదిత హేతు భూతామ్
మంత్రోక్త కార్య శుభసాధన యోగరాజ్ఞీమ్ గోదావరీమ్ శివ కృపానిధి మార్య పూజ్యామ్…
శ్రీ చంద్రశేఖర సమర్ఘ్య మహా ప్రసన్నామ్ శోభాయమాన కలకంఠి వరప్రసాదామ్
ఆశీః పరంపర వరస్మిత నేత్రపర్వామ్ గోదావరీం శివ కృపానిధి మార్యపూజ్యామ్
(కాళేశ్వరం డ్యామ్ నిర్మాణాన్ని చూసి పొంగిపోతూ.. చంద్రశేఖరునికిచ్చిన (కాళేశ్వరునికి) అర్ఘ్యం అని ఒక అర్థం. నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరుడిచ్చిన అర్ఘ్యం అని మరో అర్థం వచ్చేలా రాసిన భావన అపూర్వం. శోభాయమానం అనడంలో కూడా శ్లేషను గమనించవచ్చు)మల్లన్న సాగర మహోన్నత కీర్తి రాగామ్.. ఇలా పన్నెండు శ్లోకాలు పెల్లుబుకాయి.