ఇంటి తలుపులు ఎప్పటిలానే తెరచి ఉన్నాయి
ఇంటిలోకి వచ్చే అడుగులు లేవు
ఇంటి ముందర తొట్టిలో నీళ్ళు వున్నాయి
కడుక్కునే పాదాలు లేక ఒడవట్లేదు
దండెం మీద తువ్వాలు తుడుచుకునే వారు లేక
ఎండకి ఎండి వానకి తడిసి చీకి పోయింది
అదే దర్వాజ
మారిందల్లా పడే అడుగుల్లో వ్యత్యాసం
పలకరింపులకు నోళ్ళు పెగలట్లేదు
బెల్లం లేదు
ఈగలు లేవు
మూగిన బంధాలు మాగి కుళ్ళి
ద్రవ్యం మాటున నక్కినవి కొన్నైతే
ద్రవ్యం చేతిలో బందీని చేసిన
ప్రపంచీకరణవి కొన్ని
వెరసి బంధాలన్నీ పెట్టుబడి
చేతిలో తోలుబొమ్మలైపోతున్నాయి!
– గిరి ప్రసాద్ చెలమల్లు