నిప్పురవ్వల వంటి కవితా పంక్తులతో ఉప్పెనలా దూసుకువచ్చిన కవి అలిశెట్టి ప్రభాకర్. కవిగా, చిత్రకారుడిగా పేరుగాంచిన ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రం)లో 1954 జనవరి 12న చిన్న రాజం, లక్ష్మి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కరీంనగర్లో పూర్తిచేసిన అలిశెట్టి ప్రభాకర్ తన తండ్రి ఆకస్మిక మరణంతో 11 ఏండ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలు స్వీకరించారు.
చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించిన ప్రభాకర్..ప్రారంభంలో పలు పత్రికలకు పండుగలు, పర్వదినాలకు చిత్రాలు వేయటంతోపాటు సినీనటుల బొమ్మలు వేసేవారు. ఆ తరువాత సిరిసిల్లలో రామ్ ఫొటో స్టూడియోలో ఫొటోగ్రఫీ నేర్చుకొని 1975లో జగిత్యాలలోని తన సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియోను ప్రారంభించారు. 1979లో కరీంనగర్లో ‘శిల్పి’ పేరిట మరో ఫొటో స్టూడియో కూడా ప్రారంభించారు. జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ఆయన ప్రవేశించారు. 1975లో ఆయన రాసిన తొలి కవిత ‘పరిష్కారం’ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఆయనలోని కవితాశక్తి 1978లో ‘జగిత్యాల జైత్రయాత్ర’తో ఉప్పెనలా ఎగిసి వచ్చింది.
కొద్దిరోజుల తర్వాత హైదరాబాద్కు మకాం మార్చిన ప్రభాకర్ 1983లో చిత్రలేఖ ఫొటో స్టూడియో ప్రారంభించారు. ఫొటోగ్రఫీని తన వృత్తిగా కొనసాగిస్తూనే, అలతి అలతి పదాలతోనే అద్భుతమైన కవితలు అల్లేవారు. సమాజంలోని అవినీతిపై వ్యంగ్యాస్ర్తాలు ఎక్కుపెట్టారు. మినీ కవిత్వం రాయటంలో ఆయనదొక ప్రత్యేక శైలి. తాను రాసిన కవితలకు ఆయనే చిత్రాలు గీసేవారు. సమాజంలో జరిగే దోపిడీని చూసి ఆవేదన చెందిన ప్రభాకర్ ధర్మాగ్రహంతోనే వెక్కిరించే రీతిలో కవిత్వం రాసిన అసలు సిసలైన ప్రజాకవి.
‘పడుకుని ఉన్నా గుండె గడియారమౌతుంది ఒక్కొక్కప్పుడది నిద్ర పట్టనివ్వని అలారమౌతుంది’ ఇలా తేట తేట మాటలతో అందరికీ అర్థమయ్యే రీతిలో కవిత్వం రాసి అందరి గుండెల్లోకి ప్రవేశించారు ప్రభాకర్. ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్త రేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ మొదలైన 15 పుస్తకాలను ఆయన రచించారు.
‘చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది గుండెంటూ కలిగుంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది’అలిశెట్టిలో వామపక్ష సామ్యవాద విప్లవ భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపు 10 సంవత్సరాలు విప్లవ రచయితల సంఘం సభ్యునిగా కొనసాగారు. విరసం సభల సందర్భాల్లో ఆయన రాసి, గీసిన కవితా చిత్రాలను ప్రదర్శించేవారు. అవి ఆనాటి యువకులు, కళాకారులను ఎంతగానో ఆకర్షించేవి.
‘ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరినీ మోసగించనని ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు ఈ కట్టు కథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి’సినిమాల్లో పాటలు రాసేందుకు ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినా డబ్బు కోసం కవిత్వాన్ని అమ్ముకోనని, ప్రజల కోసమే ప్రజల బాధలు తీర్చటానికే కవిత్వం రాస్తానని, ప్రజల బాధలను కవిత్వంలో ప్రతిఫలింపజేసిన కవి అలిశెట్టి ప్రభాకర్.
‘తను శవమై..
ఒకరికి వశమై..
తనువు పుండై..
ఒకడికి పండై..
తను ఎడారై..
ఎందరికో ఒయాసిస్సై..’
ఒక వేశ్య గురించి ఇంత తక్కువ మాటల్లో, ఇంత గొప్పగా ఒక్క అలిశెట్టి ప్రభాకర్ గాక ఇంకెవరు రాయగలరు? ఆయన రాసిన ‘నగర గీతం’ అనే కవిత ప్రస్తుతం పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా రూపొందింది. తన కళ ప్రజల కోసమేనని చివరి వరకు నమ్మిన అలిశెట్టి ప్రభాకర్ అనారోగ్యంతో తాను జన్మించిన రోజునే..అంటే 1993, జనవరి 12న పరమపదించారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939