మా వాడలన్నీ మేడలతో కాదు
బీడీల బేడీలకు వేళ్ళనప్పగించిన
ఆడ ఖైదీలతో నిండిపోతాయి…
ఈ శ్రామిక ఎడారిలో
కన్నీటి కాలువలే వాళ్లకు ఎండమావులు
దిగమింగుకునే దిగుడుబావులు..
మీరంతా ఇక్కడి వీధులన్నీ
పగటి గూర్కాల తిరగాలే కానీ-
తిరగబడ్డ తెప్పలై
నీరస ప్రవాహంలో కొట్టుమిట్టాడే
ఎంతమంది అమ్మలక్కలు కనిపిస్తారో!
బహుశా మీకు తెలియదు కానీ-
పట్నపు వీధుల్లోనో, పాన్ డబ్బాల జాగాల్లోనో
రైలు బండిలా పొగను వదిలే
ఏ వ్యక్తిని చూసినా,
కాలుతున్న బీడీల్లో
మా తల్లుల కష్టమే కనిపించేది
తెలుసా! ఈ తునికాకు పుడలే
మా అమ్మల జీవితాలకు ఆటవిడుపులు,
కష్టాలను నింపుకునే వాళ్ల సెమట ముడుపులు…
ఇదిగో ఈ ఇనుప కత్తెర, తంబాకు సంచి,
గీ రీల్దారం, బూడిద, బింగిలే కదా –
ఆకలి యుద్ధభూమిలో
మా అమ్మలక్కలకు దొరికిన అస్త్ర శస్ర్తాలు,
ఎప్పటికీ వదిలిపోని ఆప్త నేస్తాలు…
అంతెందుకు-
సాయంత్రపు ఆకాశంలో
సందమామ సుట్టూ చేరే సుక్కల్లా
వీధి దీపపు వెలుగు కింద
ఆడకట్టు అమ్మలక్కలంతా చేరి-
నజరంతా హజార్ బీడీలపై వేసి,
దారపుండలను సుట్టో,
తంబాకు ఘాటుకు శ్వాసనదుపు జేసో,
గంటలకొద్ది సాటముందు కూసునేటోళ్లకు
ఏ ధ్యాన యోగైనా సాటి రాగలడా?
ఇదిగో-
ఈ ఆకలి వ్యూహాన్ని ఛేదించాలనే కదా
ఇందులోకి ఒంటరిగా అమ్మక్కలు దిగింది.
కొంగులో పైన పైసాను దాసింది
నిజంగా వెళ్లడమైతే
వాళ్లు వెళ్లారు గానీ-
ఒళ్ళు నొప్పులకు అక్కడే
అభిమన్యులై దొరికిపోయారు
అప్పుడు ఆ అమ్మల దుఃఖాన్ని చూస్తే –
అంపశయ్యపై భీష్మునిలా,
అగరుబత్తీలు గుచ్చిన అరటిపండులా,
వాళ్ల ఎదలో దుఃఖపు బాణాలు,
వాళ్ల మదిలో కన్నీటి పుల్లలు-
ఎంతగా దిగబడ్డాయో తెలుస్తుంది,
ఎంతగా చొరబడ్డాయో కనిపిస్తుంది..
– సందీప్ వొటారికారి 93902 80093