ఆరు నెలల పాప తండ్లాడుతూ తండ్లాడుతూ
మరో పక్కకు బోర్లా పడబోవడమే క్రియాశీలత
పడుకోనున్నప్పుడు మాటల అలికిడి గమనించి
చూపులన్నీ నవ్వులై పూయడమే శిల్ప రహస్యం
చిన్ని చిన్ని కాళ్లురెక్కలు లయాత్మకంగా ఆడిస్తూ
మిన్నంటే కీకలు పెట్టడమే పద పదాల ఆలాపన
పడుకోనున్న తనే మును ముందుకు పరితపిస్తూ
మోకాళ్ల మీంచి అంబాడటమే వాక్య నిర్మాణం
గదిలో గోడల ఆసరాతో నిలబడే ఎత్తుగడలే
దీర్ఘ కవిత్వ చలనానికి వస్తువుల ఎంకులాట
పడుతూ లేస్తున్న బుడ్డ పాదాల ప్రయోగాలు
సృజించబోయే పద్య పాద విభజనకు ఊహలు
ఇంతింతై ఎదుగుతున్న శిశువే సృజన రూపం
నవ్వులు నడకలు ఇంటిల్లిపాదికీ కవి సమ్మేళనం.
– అన్నవరం దేవేందర్ 94407 63479