Where to Start? Everything Cracks and Shakes, The air Trembles with Similies, no one world’s better than another, earth moans with metaphors.
– Osip Mandelstam
అలిశెట్టి ప్రభాకర్ చనిపోలేదు. ఇప్పుడతని స్మృతి వర్తమాన జీవితమే. మరణాన్ని ఓటమి పాలుచేసిన కవిత్వ జీవితం తనది. అతని కవిత్వం తంగేడు వనం. పాఠకునిలో ఎప్పటికీ అనులోమ విలోమాలను శ్వాసిస్తూ.. జీవితాన్ని నిలదీస్తూనే ఉంది. మూడు దశాబ్దాల కిందటనే అలిశెట్టి పాఠకునిలో జ్వర ప్రతిధ్వనిని తన కవిత్వంతో సరిగ్గా, స్పష్టంగా, గాఢంగా, సత్యస్ఫూరకంగా Curate చేశారు. కవిత్వ ప్రదర్శనశాలతో కేవలం భౌతిక ప్రపంచాన్నే కాక, అత్యంత అమానవీయమైన మానసిక లోకాన్ని విస్తృతపరిచిన రూపసార సంగతులు తన కవిత్వ చిత్రాలు. వికృత రాజకీయ చేష్టలని తన కవిత్వంలోని వాస్తవాగ్రహమే దిగంబరపరిచింది. అతని కవిత్వ జీవితమంతా తర్కవితర్కాలకు చోటులేని సామాజిక, రాజకీయ, అంతరంగ విలువల పతన చిత్రాలు. వ్యవస్థీకృతమైన అరాజకీయ మార్కెట్ విధ్వంసాలు.
అటువంటి Corporate Economy దాడుల్లో మొదటగా రక్తమోడేది సృజనకారులే. అందులోనూ బతుకును నగ్నంగా ఎదుర్కొంటూ మోసే అలిశెట్టి ప్రభాకర్ వంటి కవులే. లెక్కకు దొరకనటువంటి Marginalised కవుల సమూహం ఉదాహరణగా మిగిలే ఉంది. ఉంటుంది కూడా. గుర్తించగలిగే సహన దృష్టి కావాలె మనకు. అప్పుడే ఆ కవుల సమూహాలలో కేంద్ర బిందువులాగా నిలబడి ఉన్న అలిశెట్టి నీడలు గోచరమవుతాయి. అలిశెట్టి ప్రభాకర్ జీవిత కవిత్వంలో మనం చూడటం ఇష్టపడనిదీ, భయపెట్టేదీ అతని మృత్యు నిరాకరణ. Completion of lifeని తను పూర్తిగా నిరాకరించారు. అంతాన్ని పక్కకుపెట్టి బతుకులోని చలనశీలతను ఆఘ్రాణిస్తూ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నారు. ‘మరణం తన చివరి చరణం కాదు’ అంటూ జీవ కవిత్వాన్ని కాపాడుతూ పాఠకుడు కోరుకునే ఒక Supra Logical Validity అలిశెట్టి కవిత్వంలో గర్భస్థమై ఉంది. ఆ కవితా చిత్రాల్లో క్లుప్తత ఉంటుంది. గాఢత ఉంటుంది. సత్యాగ్రహ నెనరు ఉంటుంది. అపురూపమైన మానవీయ మమకారం ఉంటుంది.
‘గుండె నిండా బాధ కళ్లనిండా నీళ్లున్నప్పుడు/ మాట పెగలదు/ కొంత సమయం కావాలి/ దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు/ చెల్లాచెదురై/ హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత/ వ్యవధి కావాలి’ అంటూ స్పష్టతలో గాఢతను చెక్కుతూ పోతుంటారు.
ఆధునిక కవిత్వ దారుల నుంచి నేటి అత్యాధునిక (Post Corona stage Managed) కవిత్వం దాకా కవితను చీకటిదారుల్లో నడిపే నెగడు వలె ఉంటారు. తను జీవించి సాధించిన సత్యాన్ని, ప్రవక్తలాగా మామూలు రూప చిత్రాలతోనే చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. విస్పష్టమైన అర్థాలను ఇస్తూ కూడా మరొక్కసారి వాచకాన్ని తిరిగి అర్థం చేసుకొమ్మనే సూచనను ఇస్తుంటారు. మళ్లీ de-understand చేసుకొమ్మని తన లోపలి, బయటి నిర్మాణాలని, పాలనలని వినిర్మాణం చేసుకుంటూ కొత్త అర్థాలను వెదుక్కోమనీ ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకే నిజమైన కవి ఎప్పటికీ హీరో లేదా నాయకుడే అవుతాడు పాఠకునికి. అలిశెట్టి ప్రభాకర్ వంటి protagonist కవి లాగా.
‘వేదనతో/ పండిన/ గుండెను/ పిండి/ ప్రశ్నిస్తే రెండువైపులా/ కన్నీళ్లు/ మొండిగా/ సమాధానం చెబుతాయి. (‘ఎర్ర పావురాలు’ సంకలనంలోని కవిత సమాధానం)
‘బాంబుని/ చూడగానే/ బెంబేలు పడితే/ అదెప్పుడూ/ నీ గుండెల్లోనే/ పేలుతుంది.’ (‘ఎర్ర పావురాలు’ సంకలనంలోని ‘భయం’ కవిత నుంచి)
తన చుట్టూ ఉన్న సమాజంలోని వైరుధ్యాలను, రాజకీయ Chaotic పెనుగులాటల్నీ, వ్యక్తుల కుటుంబ సంబంధాల్నీ, తక్కువ పదాలతో దృశ్యాలకు పట్టించారు. నిడివి తక్కువగా ఉన్న కవితలు Visual Narrativeతో సామాన్య పాఠకుడిని ఇబ్బంది పెట్టకుండా గుండెలోకి జారిపోతాయి. మామూలుగా తోచే పదపంక్తిలోని, అసాధారణమైన దుఃఖాగ్రహం మనసుకీ తగులుతూ ఉంటుంది. ముందుగా కవి తాలూకు Melancholy పాఠకుడి Reasoningని ముక్కలు ముక్కలు చేస్తుంది. అతని అనుభవాన్ని గడప దాటిస్తుంది.
ఇది నగర గ్రామీణ కవిలోని ఒక బలమైన భాగం. వద్దనుకుంటూనే నగరానికి వలస రావడం వల్ల భాషతో బలమైన ఎకానమీ చోటుచేసుకుంది. రోజూ కమ్ముకునే guilt తో సహా. ఆ guilt తన ఇంటిని వదిలేసి వచ్చిన నేర భావనలోని పార్శమే కానీ ఇంకొకటి కాదు. వాస్తవ దర్శనమే తన కవిత్వంలోని ఆకర్షణ అంతా.
‘చీకట్లో జడుసుకుంటే/ ఒక చెట్టే నీ చుట్ట్టూరా/ అరణ్యమై భయపెడుతుంది/ గుండెంటూ కలిగుంటే/ నీ వెంట అదే/ పెద్ద సైన్యమై నిలుస్తుంది’ (‘మంటల జెండాలు’లోంచి ‘గుండె సైన్యం’ అన్న కవిత)
‘అలా
సమాధిలా
అంగుళం మేరన్నా
కదలకుండా పడుంటే ఎలా
కొన్నాళ్లు పోతే
నీ మీద నానా గడ్డీ మొలిచి
నీ ఉనికి నీకే తెల్సి చావదు’
(‘రక్త రేఖ’ సంకలనంలోని ‘ఉనికి’ కవితలోంచి)
జీవితంలోని ఆగ్రహ చింతన.. కవిత్వ ధ్యానం.. ఇవి రెండింటినీ కలిపి సాధించిన సరళశైలి తనది. చదువుతున్న కొద్దీ, అనుభవం దగ్గరవుతున్న కొద్దీ పాఠకునిలో గాఢత పెరుగుతూ పోతుంటుంది. అందుకే ఇప్పటి తరానికి కూడా ఆయన మిగిలే ఉన్నారు. దుఃఖమూ, ఆకలీ అరకొర జీవితంలోని జరుగుబాటు లేకుండా కాల్చివేసే వేదన లేకుండా అలిశెట్టి ప్రభాకర్ కవిత్వమే లేదు.
అడవిలో గాయపడిన జింక పిల్ల లాగా పులిని రెచ్చగొడుతూ తప్పించుకుంటూ ఎంతో ఎత్తుకు ఎగురుతూ, తను ఎంచుకున్న కవిత్వ మార్గంలో జీవించినట్టు అనిపిస్తుంది. తన చుట్టూ కమ్ముకొని ఉన్న రాజకీయ, సామాజిక వ్యవస్థలోని హింసా ప్రవృత్తికి జవాబుగా అలిశెట్టి కవిత్వాన్ని నిలబెట్టుకున్నారనిపిస్తుంది. తనలో ఉన్న స్పందనాగుణం ప్రేమ, స్నేహ గుణం, మృత్యువును బతుకులోంచి బహిష్కరించగలిగింది. సాటి మనిషి బాగుకోసం, అసమానతలను రద్దుచేసే స్వప్న సాక్షాత్కారాన్ని ఆయన కోరుకున్నారు. తను నిద్ర నుంచి లేచినప్పుడల్లా… తనకంటే ముందే లేచి నిలిచి ఉన్న వేదనతో.. సోపతి చేస్తూ జీవించగలిగారు. తన మార్గాన్ని ఎవరూ ఎంచుకోలేరు. అది ఇప్పటి కార్పొరేట్ పద్మవ్యూహ జీవితాన్ని నిలువరించడానికి వేగం తగ్గించడానికి Antidote లాగా పనిచేస్తుంది.
రాజకీయాల, జెండాల, సిద్ధాంతాల మత మౌఢ్యాల తొక్కిసలాటలో తప్పిపోతూ రక్తసిక్తమవుతున్న మనిషిని కవి అలిశెట్టి ప్రభాకర్ అచ్చమైన కవుల సరసన నిలబడి వెతుక్కుంటూనే ఉన్నారు తన కవిత్వం ద్వారా. చిక్కడ్పల్లి, సునందా, గుల్షన్ ఇరానీ కేఫ్ గల్లీలు, నల్లకుంట, రాంనగర్ చౌరస్తాలు, మేదరబస్తీ చ్యాటల బొంగుల దుకాణాలు, బర్కత్‌పురా చౌరస్తా నడుమ నరికివేసిన రాగిచెట్టు, దాని ఊడలకు వేలాడదీసిన కందీళ్ల రిక్షా స్టాండ్లూ Fade in Fade out అవుతూ, dissolve అవుతూ తిరిగి నిద్రలేసే అతని చిత్రాక్షర రేఖలూ కవిత్వ క్షణ నిముషాలు ఎన్నెన్నో…
తనతో చివరిసారి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కవిత్వ వేదిక పంచుకున్న పొగ దిగులు జ్ఞాపకం పచ్చిగానే ఉంది. అక్కడ తను ‘మరణం నా చివరి చరణం కాదు’ కవిత చదువగానే నేను ఎంతో బాగుందనగానే నన్ను గట్టిగా కౌగిలించుకొని నవ్వుతూ.. అశోక్‌నగర్ గల్లీల్లోకి వెలుతురు నీడగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. కవిత్వాన్ని వెతుక్కుంటూ తన రూపశాలను జారవిడిచి మరొక సమాగమం కోసం దోస్తులను వెతుక్కుంటూ. నేను అతని Hypnotic నీడలో నిలబడిపోయాను పాఠకుని సమూహంలో. అతను ఇప్పటికీ పలకరిస్తూనే ఉన్నాడు. ‘మరణం నా చివరి చరణం కాదు’ అంటూ.. నేను తన వాక్యాన్ని పాటగా మలుచుకొని ఉన్నాను. అతను తన కవితను విన్పిస్తూనే ఉన్నాడు.
‘పడుకొని ఉన్నా / గుండె /
గడియారమవుతుంది /
ఒక్కొక్కప్పుడది/
నిద్ర పట్టనివ్వని/ అలారమవుతుంది’
(ఎర్ర పావురాలు’ సంకలనంలో ని ‘గుండె’ అనే కవితలోంచి)
Wild honey smells of freedom the dust of sun light the month of a young girl, like a violet but gold- smells of nothing.
– anna akhmatova
– కవి సిద్ధార్థ 73306 21563