Raja Saab | ఇండియన్ సినిమా స్థాయిని మార్చిన భారీ యాక్షన్, పీరియాడిక్ చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూర్తిగా భిన్నమైన దారిలో అడుగుపెడుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకు ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా మాత్రమే చూసిన ప్రేక్షకులకు, ఈ సినిమా పూర్తిగా వినోదాత్మక హారర్ కామెడీ అవతార్‌లో చూపించబోతోంది. దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీకి హారర్ ఎలిమెంట్స్ జోడించి, ప్రభాస్ ఇమేజ్‌కు కొత్త డైమెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో చలాకీతనం, టైమింగ్, కామెడీ అన్నీ కీలకంగా ఉండబోతున్నాయట. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా కథను డిజైన్ చేసినట్లు సమాచారం. సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించడంతో కథకు బలమైన బరువు వచ్చింది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముగ్గురు హీరోయిన్లు ఉండటం మరో ప్రత్యేకతగా మారింది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, ఈ సినిమా విజువల్ గ్రాండియర్ కంటే కంటెంట్, ఎంటర్టైన్మెంట్పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రభాస్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్నాయి. యు/ఏ సర్టిఫికెట్ రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా చూడగలిగేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు.
వ్యాపారపరంగా కూడా ‘ది రాజా సాబ్’ ప్రత్యేకంగా నిలుస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. సంక్రాంతి సీజన్ కావడం సినిమాకు మరింత కలిసివచ్చే అంశంగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించగా, సుమారు రూ.400–450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ పొందింది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు 183 నిమిషాల రన్‌టైమ్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు రూ.120 కోట్లకు, హిందీ హక్కులు రూ.30 కోట్లకు, తమిళ హక్కులు రూ.8 కోట్లకు, కర్ణాటక హక్కులు రూ.15 కోట్లకు, కేరళలో రూ.4 కోట్లకు విక్రయమైనట్లు సమాచారం. ఇక విదేశీ మార్కెట్లో కూడా ‘ది రాజా సాబ్’ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో థియేట్రికల్ హక్కులను సుమారు 9 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.80 కోట్లకు ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నట్లు టాక్. ఈ లెక్కలన్నింటిని కలిపి చూస్తే ఈ చిత్రానికి సుమారు రూ.250–260 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అంచనా. ఈ లెక్కల ప్రకారం ‘ది రాజా సాబ్’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.