వాస్తవికతను కలిగిన గద్య కల్పిత గాథను ‘కథ’ అంటారు. తెలుగులో కథలు వచ్చినంతగా కథా విమర్శ లేదని అందరూ అంగీకరిస్తారు. కథా నిర్మాణంలో వస్తువు, భాష, శైలి, శిల్పం, ఇతివృత్తం, పాత్రలు, సన్నివేశ చిత్రణ, సంభాషణలు, రచయిత గొంతు వంటి ఇత్యాది అంశాల్లో ‘వాస్తవికత, కల్పితాంశం’ అనేవి ప్రధానమైనవి.
కథలో పాఠకునికి ‘వాస్తవికత’ అనేది మానవ జీవన సారూప్యతను కలిగిస్తే, ‘కల్పితాంశం’ అనేది మానవ భావోద్వేగ జ్ఞానాన్ని లోతుగా విస్తరించడానికి దోహదపడుతుంది. కథలో రచయిత కల్పిత స్థాయిని బట్టి కథలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. వాస్తవికత లోపించిన ఊహాజనిత కథలు, తక్కువ కల్పితాంశం కలిగిన కథలు, కల్పితాంశం లోపించిన వాస్తవిక కథలు, వాస్తవికత, కల్పితాంశం సమపాళ్లలో కలిగి ఉన్న కథలు.
కథ కూడా సృజనాత్మక ప్రక్రియేనని అందరూ ఒప్పుకుంటున్నా, నిజానికి కల్పితానికి, సృజనకు వ్యత్యాసం ఉన్నది. కథలో రచయిత ఊహకు సృజన అవసరమైనా, అది అక్కడే ఆగిపోతే దానిని ‘కల్పితం’ అంటారు. అలా కాకుండా ఊహను వాస్తవికంగా మార్చడానికి ప్రయత్నిస్తే దాన్ని ‘సృజనాత్మకత’ అంటారు. దీని ఆధారంగా కథలను వాస్తవిక, కల్పిత, సృజనాత్మక కథలుగా వర్గీకరించుకోవచ్చు.
సృజనాత్మక కథల్లో సామాజిక ఆదర్శం ఉంటుంది. ఆదర్శం సామాజిక సంస్కరణను కోరుకుంటుంది. రచయిత ఊహలో కథాంశం స్వీయ లేదా సామాజిక సమస్య ప్రధానంగా, వాస్తవిక ప్రపంచంతో అనుసంధానమై పరిష్కారం కనుగొనడానికి దారిని అన్వేషిస్తున్నట్టుగా సృజనాత్మక శైలిలో ఉంటుంది. కల్పితాంశ కథలో కథకుడు తనతో పాటుగా పాఠకులను ఊహా ప్రపంచం వరకు మాత్రమే పరిమితం చేయగలడు. వారు మిథ్యా ప్రపంచ అవధులను దాటి వాస్తవిక ప్రపంచంలోకి అడుగుపెట్టలేరు. కాబట్టి, సృజనాత్మక కథల్లో ‘సంస్కరణవాదం’ ఉంటుంది. తెలుగులో మొదటగా వచ్చిన కథల్లో ఈ సంస్కరణవాదమే ప్రధానంగా కనిపిస్తుంది. తెలుగు కథలో కల్పితాంశం క్రమంగా సృజనాత్మకత వైపు పరిణామం చెందడంతోనే కల్పితవాదం నుంచి, వాస్తవిక, సంస్కరణవా దం పరిణామం చెందింది.
కల్పిత కథలుగా విక్రమార్క కథలు, దశకుమార చరిత్ర, పంచతంత్ర కథలు, కాశీమజిలీ కథలతో పాటుగా జానపద కథలు భారతీయ సాహిత్యంలో అచిరకాలంగా ప్రజల మన్నన పొందిన కథలు. కవి త్వం లాగే కథ కూడా కాలంతో పాటు పరిణామం చెంది సంస్కరణవాదం సామాజికవాదంగా మారింది. దీని ఫలితంగా తెలుగులో వచ్చిన కథలు సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులను ప్రతిబింబించే విధంగా రాయబడినాయి. అభ్యుదయ కథలు, విప్లవ కథలు, దళిత కథలు, స్త్రీవాద కథలు, మైనారిటీ కథలు, బహుజనవాద కథలు, ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాల నేపథ్యం ఉన్న కథల వంటి అనేక రకాల సంస్కరణ ప్రధానంగా కథా సాహిత్యం వచ్చింది. అయితే, కథా సాహిత్యంలో ఉన్నంతగా సంస్కరణవాదమనేది కవిత్వంలో కనిపించదు.
కల్పనలో సంస్కరణవాదమనేది సామాజిక మార్పును ప్రోత్సహించడానికి ఒక సృజనాత్మక కళాసాధనం. గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కథలో వేశ్యాలోలుడైన భర్తను భార్య కాపాడుకోవడం, బండారు అచ్చమాంబ రాసిన ‘ధన త్రయోదశి’ కథలో దురాశకు లొంగకుండా ఉండటం కథాంశాలు. సురవరం ప్రతాపరెడ్డి వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ‘సంఘాల పంతులు’ కథను రాశాడు. చెరబండరాజు రాసిన విప్లవ కథ ‘చిరంజీవి’. పోలీసు వ్యవస్థను విమర్శిస్తూ, నక్సలిజానికి సానుభూతిగా ఈ కథను రాశాడని ఉమ్మడి ఏపీలోని శాసనసభలో హోంమంత్రి చదివి, ఈ కథను ప్రభుత్వం నిషేధించినట్టుగా ప్రకటించారు.
నెల్లూరి కేశవస్వామి కథలు ప్యూడల్ సమాజానికి ‘యుగాంతం’ పలికిన కథను, మతంతో సంబంధం లేని ‘కేవలం మనుషులం’ వంటి కథలను రాశారు. పీవీ నరసింహారావు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ నిజాం వ్యతిరేక ఉద్యమ కాలం నాటి కథ. వెట్టిచాకిరి, శ్రమదోపిడీపై బోయ జంగయ్య రాసిన ‘ఎచ్చరిక’, గ్రామీణ దోపిడీ, అణచివేత ప్రధానంగా అల్లం రాజయ్య రాసిన ‘ఎదురు తిరిగితే’ వంటివి అభ్యుదయ కథలు. విప్లవ సాహిత్య అవగాహనలో బహుజన, దళిత జీవన తాత్వికతతో కథలు రాసిన వారు బీఎస్ రాములు.
‘పాలు’ కథలు తెలంగాణ సామాజిక పరిణామాన్ని వివరించే కథలు. తెలంగాణలో దళిత కవిత్వం వచ్చినంతగా కథలు రాలేదనే విమర్శ ఉన్నది. ఈ లోటును గుడిపల్లి నిరంజన్ సంపాదకీయంలో ‘తెలంగాణ దళిత కథలు’, ప్రతీ ఏటా వచ్చే ‘కథా వార్షికలు’ ఆ లోటును భర్తీ చేస్తున్నాయి. బోయ జంగయ్య ‘పనిష్మెంట్’ కథ, కాలువ మల్లయ్య ‘వెలి’ కథ, జూపాక సుభద్ర ‘రామక్క మాన్యం’, జాజుల గౌరీ ‘మన్ను బువ్వ’ వంటి కథలతో దళిత స్త్రీలను చైతన్యవంతులను చేస్తే, ఇల్లిందల సరస్వతీదేవి, పాకాల యశోద ‘ఎచ్చమ్మ కథలు’, ముదిగంటి సుజాతారెడ్డి ‘విసుర్రాయి’, షాజాహానా‘సిల్ సిలా’, ‘లద్దాఫ్ని’ వంటి వారు తమ కథల ద్వారా మహిళలను చైతన్యపరిచారు.
ఓల్గా రచించిన ‘అయోని’ కథ స్త్రీ సంస్కరణవాద ఇతివృత్తంతో కూడిన కథ. ఇందులో పదేండ్ల బాలిక తన స్త్రీత్వంపై వ్యధాపూరిత ఆగ్రహం వ్యక్తం చేసిన సాంఘిక సంస్కరణవాదం శక్తివంతంగా కనిపిస్తుంది. పొట్లపల్లి రామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, కాంచనపల్లి చిన వెంకట రామారావు, ఆవుల పిచ్చయ్య లాంటి వారు కాల్పనికతకు దూరంగా, వాస్తవిక ఉద్యమ సంఘటనలను ప్రతిబింబిస్తూ కథలు రాశారు. గూడూరి సీతారాం సిరిసిల్ల కార్మికుల జీవితాలను, బహుజన జీవితాలను దేవులపల్లి కృష్ణమూర్తి ‘కథల గూడు, తారుమారు’ కథలలో, ఉప్పల నరసింహం ‘సబ్బండ వర్గాల సారస్వతం’ పేరుతో కథలను రాశారు. ఇవన్నీ సంస్కరణవాద కథలే.
సంస్కరణవాద కథల్లో కల్పితాంశంతో రాసిన కథలు, సృజనాత్మకతతో రాసిన కథలున్నాయి. సృజనాత్మక కథల్లో ఊహాజనిత ప్రపంచం కనపడదు. వాస్తవిక జీవన సమస్యలు, సామాజిక సంవేదనలుంటాయి. సమాజంలోని కట్టుబాట్లను కాపాడే ఆదర్శం పట్ల నిరసన ఈ కథల్లో వ్యక్తం చేయబడి ఉంటాయి. అయితే సంస్కరణవాద కథల్లో హితబోధనం ప్రధానంగా ఉండి, కళాత్మకత శైలి లోపించడం వల్ల పాఠకులను ఆకట్టుకోలేని శైలి ఉంటుందనేది ప్రధాన విమర్శ. అయినప్పటికీ తెలుగు కథాకల్పనలో సామాజిక సంస్కరణవాదమే పైచేయి సాధించిందని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.
– శీలం భద్రయ్య, 98858 38288