మన తెలుగు అజంత భాష. అందమైన అమర భాష. అమృత పదాల వలపు. సరస సామెతల విరుపు. నీతి శతకాల మెరుపు. పంచ కావ్యాల విరుపు. కవన విజయాల గెలుపు. మన తెలుగు జాతికి మైమరపు. పద్యం తెలుగు వారి ఆస్తి. సూక్తి, ముక్తి, రక్తి, భక్తిదాయకం. పద్య పఠన వలన జ్ఞానం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భాషపై అభిమానం, అభిరుచి ఏర్పడుతుంది. పద్యం తెలుగువారి సంస్కృతిలో ఓ భాగం. సాహితీ వికాసంలో అంతర్భాగం.
కన్నడ తమిళంలో పద్యాలున్నాయి. హిందీలో దోహాలు, చేపాయిలు, సంస్కృతంలో శ్లోకాలున్నాయి. వాటికి యతులు, ప్రాస సొగసులు లేవు. ఆ అందం, చందం, మకరందం మన తెలుగు పద్యాలలోనే ఉంది.
అలాగే అష్ట, శత, సహస్రావధాన ప్రక్రియలు మన తెలుగువారికే సొంతం. ఆ క్రమంలో గర్భ కవిత్వం కూడా ఓ చక్కని ప్రక్రియ. అంటే ఒక పద్యంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఇమిడి ఉంటాయి. చాలా క్లిషమైన ప్రక్రియ. దీనిలో భాషా వికాసం, భాషా సౌందర్యం ఉంటుంది. ఈ దిగువ నేను వ్రాసిన పద్యంలో గర్భ కవిత్వాన్ని ఆస్వాదించగలరని ఆశిస్తున్నాను.
ఉత్పలమాల (వృత్తం)
ఏసిరి పొందినన్నిచట నేసిరి
లేదని యేడ్చు చుంద్రు సే
వే సిరిరా యిలన్ కనుము
నెందరో యార్తుల గావు కేకలన్
నీ సిరి కన్ననూ కొలువు నీదరి
పేదల కూర్మితోడ దా
నం సిరులే కదా! నిజము
నాదను భావన నీవు వీడుమా
తేటగీతి (ఈ పద్యంలోనే ఉన్నది)
ఇచట నేసిరి లేదని యేడ్చుచుంద్రు
కనుము నెందరో యార్తుల గావు కేక
కొలువు నీదరి పేదల కూర్మితోడ
నిజము నాదని భావన నీవు వీడు
కందం (పద్యంలోనే ఇమిడి ఉన్నది)
సిరి పొందినన్నిచట నే
సిరిలేదని యేడ్చుచుంద్రు సేవే సిరిరా
సిరి కన్న నూ కొలువు నీ
సిరి పేదల కూర్మితోడ దానం సిరియే
– రాఘవ మాస్టారు 6362973252