అఫ్సర్ కవిత్వానికి నలభై ఏండ్లు. ఇప్పటితరం వాళ్లు ఇన్నేండ్ల పాటు సాహిత్య ప్రయాణం చేయగలరా? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సందేహంగానే ఉంటుంది. ‘రక్తస్పర్శ’ నాటి అఫ్సర్ భౌతికంగా ఎలా ఉన్నాడో నాకు తెలియదు. మానసికంగా, ఉద్వేగంగా ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే మాత్రం ఆ కవితా సంపుటే సాక్షి. తన 2వ కవితా సంపుటి ‘ఇవాళ’ నాటికి పరిస్థితులు మారాయి. అప్పటికి అఫ్సర్ మానసిక, సామాజిక అనుభవాలు వేరు. సామరస్య వాతావరణంలో మార్పులు వచ్చాయి. స్వేచ్ఛ దారి తప్పింది. ‘వలస’ నాటికి కవిత్వం ఒక గమ్యం కాదు, అది ఎప్పుడూ ఒక మజిలీ అని ప్రకటించుకున్నాడు. ఎప్పటికీ ఎవరూ వదిలించుకోలేని వర్తమానం కవిత్వానికి ప్రాణమని బలంగా నమ్మాడు. స్థల కాలాలను అన్వేషించకుండా ఏ కవీ కవిత్వం రాయడు. జీవితంలోని రంగులు తెలియాలి. వ్యవస్థలోని స్థాయీభేదాలు తెలియాలి. 80ల నాటి అఫ్సర్ వేరు, 90ల నాటి అఫ్సర్ వేరు. అఫ్సర్ అనే కవే కాదు, ఏ కవి అయినా నిలువ నీరులా ఉంటే పాఠకుల ముందు తేలిపోతాడు.
‘వలస’ కవిత సంపుటి నాటికి నేనొక విభిన్నమైన వాస్తవికతని, నేను స్త్రీని, నేను దళితుడిని, నేను మైనారిటీని, నేనో మూడవ ప్రపంచాన్ని, చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడిన సంక్లిష్ట అంతరంగాన్ని చూసి రోజులు గడిచే కొద్దీ భయపడుతున్నా, అనేక సమూహాల రేపటిని, అస్తిత్వవేదనని, జీవనయాతనను నేను, నేనొక అనేక వచనాన్ని అని చెప్పుకొన్నాడు. ఆయన కవిత్వ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఖండికల ద్వారా పొరలు నిర్మించడం, ఆ పొరలను విప్పుకొంటూ పోవడం, ఈతచాప అల్లినట్టు, ఆకు ఆకు చేర్చి విస్తరి కుట్టినట్టు అల్లిక ఉంటుంది. పాఠకుడిలోకి సొచ్చుకుపోయే సరళపదాల భావాల జోడింపు అఫ్సర్లో గమనించవచ్చు.
ఆయన ఖమ్మం జిల్లా చింతకాని నుంచి అమెరికా వరకు జరిగిన, జరుగుతున్న పరిణామాలను, సంక్షోభాలను, ఖాళీలను చూస్తున్నాడు. లోపల అంచనాలు కడుతున్నాడు. ఆ అంచనాలకు తన సృజన ద్వారా కొత్తదనాన్ని ఇస్తాడు. ఆ అక్షరాలను కొత్త ఆలోచనలతో గాఢంగా ఎలా వ్యక్తీకరించాలో తనకు తెలుసు. అఫ్సర్ కవిత్వాన్ని మొదటినుంచీ ఇప్పటివరకు పరిశీలిస్తే ప్రపంచ చరిత్ర తాలూకు అనేక మార్పులకు సాక్ష్యాలు దొరుకుతాయి. సామాజిక పరిణామాలను అవగాహన చేసుకుంటూ సాగుతున్నాడు. అఫ్సర్ స్వరం లోతైనది. ఇప్పటి అఫ్సర్ కవిత్వంలో ఒక తాత్త్విక సంవేదన పాటలా వ్యాపిస్తుంది. రాలిపడిన క్షణాల చప్పుడును ప్రభావవంతంగా చిత్రీకరించడం చూడవచ్చు. ఈ పద్యాన్ని చూడండి…
మాటల మీద నీకేమీ గౌరవమూ లేదు,
పోనీ అనుకుంటే ప్రేమా లేదు.
మాటలు నువ్వూరికే కట్టుకుంటూ వుంటావ్
వాటిని యూనిఫారాల మీద
నక్షత్రాల పరువులాగా
అలంకరించుకుంటూ వుంటావ్.
ఈ రోజుల్లో ఖాళీ అయిన మనుషులు, ప్రేమ రాహిత్యంతో కూడిన మనుషులు మాట్లాడే మాటలు ఇలాగే అభావంగా ఉం టాయని చెప్తున్నాడు. అఫ్సర్ శైలి గురించి మాట్లాడితే సరాసరి ఎదురుగా నిలబడిన, కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా కవితలు ప్రారంభమవుతాయి. అఫ్సర్ పాఠకుడితో రిలేషన్‌ను ఇట్టే ప్రారంభించేస్తాడు. చివరివాక్యం వరకు తీసుకెళ్లి తన ప్రపంచం నుంచి పాఠకుణ్ణి అతడి ప్రపంచంలోకి తీసుకెళ్లగలడు.
అఫ్సర్ కవిత్వంలో ఉన్న మరొక లక్షణం క్లుప్తత. విరహం, దిగులు, నిరాశావాదం, జీవితం తాలూకు అన్వేషణ, జ్ఞాపకాల ను పడవలా నీటిలో వదలడం ఇట్లాంటి లక్షణాలను ఎక్కువగా గమనించవచ్చు. అఫ్సర్ రంజాన్ మాసంలో రాసిన ఉపవాస పద్యాలు ఏ రోజుకారోజు ఫేస్బుక్ గోడల నుంచి కవిత్వ పాఠకుల గుండె గోడల్లోకి చొచ్చుకొనివెళ్లాయి.
1992 నాటి సంచలనాలు, 9/11 నాటి విపరీత పవనాలు, మెజారిటీ, మైనారిటీ భేదాలు ఇవన్నీ ఆయన హృదయంలో ఎప్పటినుంచో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ ప్రకంపనల ప్రతిఫలం ఈ వొక్క పొద్దు పద్యాలు. చిక్కని కవిత్వ వ్యక్తీకరణ, నిజాయితీతో కూడిన వేదన, పాలస్తీనా శిథిలాల్లో చిక్కుకున్న పసిపిల్లల ముఖాల్లోని ఆవేదన, యుద్ధం సృష్టించే అశాంతి.. ఇట్లాంటివన్నీ ఉపవాస పద్యాల్లో అలవోకగా తొంగిచూశాయి. ఈ వాక్యాలన్నీ ఒక ధ్యానంలో నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తాయి. అంతర్జాతీయ వేదిక మీద నిలబడి తన అస్తిత్వాన్ని బలంగా చెప్పుకొనే అవకాశాన్ని అఫ్సర్ పొందాడు. తన ముందు పాఠం వినడానికి కూర్చున్న పాలస్తీనా, ఈజిప్ట్, అమెరికా లాంటి దేశాల విద్యార్థుల ముఖాల్లో ఆయన తన అప్పటి రోజుల ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. అఫ్సర్ ఈ పద్యాలను నేటి ముస్లింల కండ్ల వెను క తారట్లాడే కన్నీళ్లుగా చెప్తున్నాడు. బాధితుల తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. ఈ పద్యాల్లో ఎక్కడా మనకు వ్యర్థపదాలు కనిపించవు. అనవసరంగా ఒక్క అక్షరమూ అనిపించదు.
ఇప్పటి అఫ్సర్ కవిత్వాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే పలికి న మాటల మధ్య పలకని మాటల నిశ్శబ్దంగా చెప్పవచ్చు. ఆయ న కవిత్వానికి ప్రతిబింబం ఈ వాక్యాలు..
‘కాస్త ప్రేమా కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ… నీ కోసమే వీచే గాలి
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడే పాట
చిటికెన వేలు వొదలని నీడా’
(ఈ నెల 14వ తేదీన
‘ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ’ పురస్కారాన్ని
కవి అఫ్సర్ అందుకున్న సందర్భంగా…)
– డాక్టర్ సుంకర గోపాల్ 94926 38547