కొన్ని చూపులు
తప్పించుకోవడానికి ప్రయత్నించే సమయంలోనే
విషపు కోరలెప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి!
మా అంగాంగాన్ని వాళ్లు
చూపులతో చదివేస్తుంటే
బిక్కచచ్చిపోయి
పిడుచగట్టుకుపోయిన నోటితో
ఒక్కమాటైనా అనలేక కృశించి పోతాము!
నిండు చూలాలిగా
ఆయాసంతో మరో ప్రాణికి
ఊపిరి పోసే ప్రయత్నంలో మేముంటే..
అప్పుడు వాళ్ళంటారూ
పస్తులుంచడం ఇంకెన్నాళ్ళని..!
రక్తాన్ని పాలుగా మార్చి పట్టేటప్పుడు
కాస్త పైట కొంగు అడ్డుగా పెట్టి పడుతుందామె
అమ్మతనాన్నీ దాచుకోవాల్సి రావటమే
అతిపెద్ద హింస!
చూపులను చురకత్తులు చేసి
కనిపించే పైట కొంగుచాటు అమృత స్థలాన్ని
అజంతా శిల్పాన్ని ఆసరా చేసుకొని
అందాలని ఉపమానాలు ఆపాదిస్తాడు..!
మనిషిని మాంసపు ముద్దను చేసి
ఆకలిగొన్న మృగంలా ఆరగించాలని
ఆరాటపడుతాడు
రానున్న ప్రమాదాన్ని పసిగట్టి
అదే కొంగు మృగత్వం మెడకు చుట్టి
నింగికి వేలాడదీస్తే చాలు..
మానవ మృగాల అంతం మొదలవుతుంది..!!
జయంతి
వాసరచెట్ల
99855 25355