ఎంత హనీమూన్కు వెళ్లినా.. ఆలుమగలిద్దరూ ఒకరినొకరు చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు. పిల్లగాలితో అల్లరి చేయొద్దా! చల్లని సముద్ర గర్భంలో దాగిన అందాలు చూడొద్దా! ఇన్ని చేయాలంటే లక్షద్వీప్ వెళ్లాలి! ఈ పగడపు దీవుల్లోని ప్రకృతి సౌందర్యం బాలమిత్ర కథల్లో వర్ణించిన దానికన్నా గొప్పగా ఉంటుంది. అరేబియా సముద్రంలో చెల్లాచెదురుగా ఉన్న ఈ ద్వీపాలకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మండువేసవిలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటదు. సాయంకాలం.. సాగర తీరంలో.. శీతల పవనాలు వీస్తుంటాయి. లక్షదీప్ 36 దీవుల సమూహం. ఇందులో 10 ద్వీపాల్లో మాత్రమే జనాలున్నారు.
వీటిలో బంగారం, కడమట్, అగట్టి ద్వీపాలు పర్యాటకులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కలిగి ఉన్నాయి. ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి వెళ్లడానికి ఫెర్రీలు అందుబాటులో ఉంటాయి. కయాకింగ్, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ లాంటి సాహస క్రీడలకు వేదిక ఈ ద్వీపాలు. విడిది గురించిన ఇబ్బందేం ఉండదు. బడ్జెట్ హోటల్స్ నుంచి స్టార్ రిసార్టుల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయిక్కడ. దేశీ రుచులతోపాటు విదేశీ వంటకాలూ రుచి చూడొచ్చు. హనీమూన్ జంటలకే కాదు.. కుటుంబంతో, స్నేహితులతో సరదా విహారానికీ లక్షద్వీప్ మంచి ఎంపిక. సెప్టెంబర్ నుంచి జూన్ వరకు ఇక్కడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు.
చేరుకునేదిలా..
విమానయానం: లక్షద్వీప్ చేరుకోవాలంటే ముందుగా కొచ్చిన్ వెళ్లాలి. అక్కడి నుంచి అగట్టి ద్వీపానికి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అగట్టి నుంచి బంగారం ద్వీపానికి స్పీడు బోట్లో వెళ్లాలి.
నౌకా విహారం: కొచ్చిన్ నుంచి లక్షద్వీప్ ప్రధాన దీవులకు నౌకల సదుపాయం ఉంది. దీవుల్లో విహారం, బస, బోటింగ్ అన్ని కలిపి నాలుగైదు రోజుల ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తుంటారు నౌకల నిర్వాహకులు వీటి ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు (ఒకరికి) ఉంటుంది.