శీతాకాలం మంచు కారణంగా గాలిలో ధూళి ఎక్కువగా నిలిచి ఉంటుంది. అందులోనూ చల్లదనం తోడవ్వడంతో ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, అలర్జీలు వస్తుంటాయి. ఇక అధిక కాలుష్యం ఉండే నగరాలు, పట్టణాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి సమయంలో బయటికి వెళ్లేందుకు ముక్కు, తల, ముఖాలను కప్పుతూ అటు మాస్క్లాగా, ఇటు స్కార్ఫ్లాగా ఉపయోగపడే రెడీమేడ్ స్కార్ఫ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
‘రెడీ టు వేర్ మాస్క్ లైక్ స్కార్ఫ్’, ‘ఫ్యాన్సీ స్కార్ఫ్’ తరహా పేర్లతో కాటన్, రేయాన్లాంటి వివిధ వస్ర్తాలతో రూపొందుతున్నాయి. కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా తయారు చేసిన వీటిని వెనక ఉండే వెల్ క్రో సాయంతో మనకు సౌకర్యంగా ఉండేలా అతికించి ధరించొచ్చు. వీటిలో కొన్ని టోపీ తరహాలో వచ్చేవీ ఉన్నాయి. ఇక, బయటికి వెళ్లేప్పుడు చిటికెలో బందోబస్తుగా స్కార్ఫ్ చుట్టేయొచ్చన్నమాట!