తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం అంటే భూములు, వ్యాపారాలు కాపాడుకోవడమే అని చాలామంది అభిప్రాయం. కానీ, ఆయన మాత్రం అలాకాదు. తన తండ్రి సాధన చేసిన కళను బతికించడమే తన కలగా మార్చుకున్నాడు. కనుమరుగైపోతున్న బాతిక్ ఆర్ట్‌కు జీవం పోస్తున్నాడు సిద్దిపేటకు చెందిన యాసాల ప్రకాశ్. ప్రభుత్వ కొలువు సాధించాక కూడా అభిరుచిని వదులుకోలేదు. అరుదైన బాతిక్ పెయింటింగ్స్‌తో సిద్దిపేట ఖ్యాతిని ప్రపంచవేదికలపై చాటుతున్న ప్రకాశ్ బతుకమ్మతో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే..
ఈ కళారంగంలో నేను ఉన్నంతవరకు రవీంద్రభారతి వేదికను మరువలేను. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినప్పుడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రవీంద్రభారతిలోని పలు స్టాళ్లను పరిశీలించడానికి వచ్చారు. ఆయనకు బాతిక్ పెయింట్ కనిపించగానే స్టాల్‌ను వెతుక్కుంటూ మరీ వచ్చి మా నాన్నను ఆప్యాయంగా పలుకరించారు. మా ‘సిద్దిపేటోళ్లు’ అంటూ నవ్వుతూ చమత్కరించారు. ఈ కళను బతికించాల్సిన బాధ్యతను గుర్తు చేసిన ఆ సందర్భం నాకింకా గుర్తు.

మాది సిద్దిపేట. మా నాన్న బాలయ్యకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. ఆయన యువకుడిగా ఉన్నరోజుల్లోనే కాపు రాజయ్యతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి ఈ బాతిక్ పెయింటింగ్స్‌ను నేర్చుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఈ కళను బతికించాలని బాతిక్ పెయింటింగ్స్ కొనసాగించారు. ఇంట్లోనే పెయింటింగ్స్ వేయడం వల్ల నాకూ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. మా అన్నలు కూడా నేర్చుకున్నారు కానీ, అంతగా రాణించలేకపోయారు. నా ఆసక్తిని గమనించిన మా నాన్న పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలున్న పుస్తకాలను నాకిచ్చి వాటిని చూస్తూ నేర్చుకోమనేవారు. నేను ఏడో తరగతిలో ఉండగా తొలిబొమ్మను వేశాను. తెల్ల బనీన్ మీద బతుకమ్మ బొమ్మను వేసి నాన్న ప్రశంసలు అందుకున్నాను. ఆ తర్వాత చదువుకుంటూనే అడపాదడపా బాతిక్ పెయింటింగ్స్ వేస్తూ ఉండేవాణ్ని.
డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా.. ఒకరోజు బాతిక్ పెయింటింగ్ వేసిన వస్ర్తాలు వంద కావాలని ఆర్డర్ వచ్చింది. ఆ టైంలోనే నాన్న అమెరికాకు వెళ్లారు. ఇక ఆ బాధ్యత నేను తీసుకొని మా అన్నతో కలిసి వాటిని పూర్తిచేశాను. అప్పటినుంచి పూర్తిస్థాయిలో ఇందులోనే నిమగ్నమయ్యాను. నాన్న ఈ కళను పదిమందికీ పరిచయం చేయాలనే ఆలోచనతో అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్లలో పాల్గొని బాతిక్ స్టాల్ పెట్టేవారు. ఆయన జీవితంలో సుమారు 70 ప్రదర్శనల్లో పాలుపంచుకున్నారు. బాతిక్ పెయింటింగ్స్ మీద రెండు పుస్తకాలు కూడా తీసుకొచ్చారు.
నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాకు బాతిక్ పెయింటింగ్సే ప్రపంచమయ్యాయి. పెళ్లి తరువాత నా భార్య మమత కూడా నా ఇష్టాన్ని గమనించి ఆమె నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు నాకన్నా ఆవిడే పెయింటింగ్స్ అందంగా వేస్తుంది. ఇక వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నా అభిరుచిని కొనసాగిస్తున్నాను. బోరబండలో నాన్న ఏర్పాటు చేసుకున్న ఆర్ట్ గ్యాలరీనే యూనిట్‌గా మార్చుకొని రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు కచ్చితంగా పెయింటింగ్స్ వేస్తుంటాను.

బాతిక్ పెయింటింగ్స్‌కు ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా వంటి దేశాల్లో ఆదరణ ఎక్కువ. దీన్ని మైనం చుక్కగా పిలుస్తాం. ఈ కళాఖండం పగుళ్లుగా ఉండి ఆకర్షణగా నిలుస్తుంది. తెల్ల, పుసుపు పచ్చ మైనం కలిపితే ఓ ద్రావణం వస్తుంది. దీన్ని ప్రత్యేక బాతిక్ కలంతో కాటన్ వస్త్రంపై డిజైన్ చేస్తాం. ఇలాంటి కళ.. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో పుట్టిందనే విషయం చాలామందికి తెలియదు. అందుకే ప్రతి ఎగ్జిబిషన్లో వీటిని ప్రదర్శిస్తున్నాను. నాన్న పల్లెటూరికి సంబంధించిన బొమ్మలు మాత్రమే వేశారు. నేను కాస్త వినూత్నంగా తెలంగాణ వచ్చిన తరువాత మన పర్యాటక ప్రదేశాలను బాతిక్ పెయింటింగ్స్ రూపంలో వేస్తున్నాను.
రామప్ప, చార్మినార్, కాకతీయ కళాతోరణం వంటి వారసత్వ సంపదతో పాటు గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టే కొమ్ము, వాయిద్యాలు, గిరిజన నృత్యాలను సైతం బాతిక్ పెయింటింగ్స్‌లో ఆవిష్కరిస్తున్నాను. చాలావరకు పెయింటింగ్స్‌ను ఫొటో ఫ్రేమ్స్ రూపంలో అందిస్తుంటాను. అవి ఇంట్లో గోడలకు లేదంటే కార్యాలయాల్లో గోడలకు ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటితో పాటు దుపట్టా, టవల్స్‌పై కూడా పెయింటింగ్స్ వేస్తున్నాం.
మన పనిని మనం నిజాయతీగా చేసుకుంటూ ముందుకు సాగితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నా విశ్వాసం. ఒకసారి కేరళలో ప్రదర్శనకు వెళ్లాను. అక్కడ ఓ కస్టమర్ కలిసి తమ నూతన ఇంటికి పెద్దపెద్ద సైజ్‌లో బాతిక్ పెయింటింగ్స్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. సరే అని కష్టపడి వాటిని తయారు చేసిన తరువాత వద్దని క్యాన్సిల్ చేశాడు. వాటిని తీసుకొని నిరుత్సాహంతో వెనుదిరిగాను. అప్పుడే హైదరాబాద్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్లో వాటిని పెడితే రెట్టింపు లాభమొచ్చింది. ప్రస్తుతం నిర్మల్ ఇండస్ట్రీలో ఆర్ట్ టీచర్‌గా పనిచేస్తున్న నేను భవిష్యత్తులో కార్పొరేట్ తరహాలో బాతిక్ పెయింటింగ్స్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆసక్తి ఉన్నవారికి ఈ కళను నేర్పించడానికి నేను సిద్ధమే!
– రాజు పిల్లనగోయిన