జగిత్యాల, జూన్ 10: వడ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగింది నిజం కాదా..? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఏ గ్రేడ్‌కు బదులు బీ గ్రేడ్ రకంలో వరి ధాన్యం కొనుగోలు చేసింది వాస్తవం కాదా..? క్వింటాల్‌కు ఏడెనిమిది కిలోలు కటింగ్ పెట్టలేదా..? కాంటాల కోసం నెలల తరబడి రైతులు సెంటర్ల వద్ద పడిగాపులు కాయలేదా..? అని నిలదీశారు. మీ అంచనా ప్రకారం జగిత్యాల జిల్లాలో 5.50లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే.. తరుగు పేరిట రూ.107కోట్ల అవినీతి జరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల కలెక్టరేట్లో ప్రెస్‌మీట్ నిర్వహించగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్‌లోని నివాసంలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఊ అంటే రాజీనామా చేస్తా’నంటూ ప్రకటనలు చేయడం మంత్రికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగినా లక్ష్మణ్‌కు కనిపించడం లేదా..? రైతుల గోడు వినిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కూడా కల్లాల వద్ద 20 శాతం వడ్లు అలాగే ఉన్నాయని ధ్వజమెత్తారు.
మంత్రి ఘనకార్యం వల్ల జిల్లాలో 40 కిలోల బస్తాకు 3.3కిలోలు అదనంగా తూకం వేస్తున్న విషయం ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతులే చెబుతారన్నారు. సెంటర్లలో లారీలు రావు, వచ్చిన హమాలీ కొరత ఉందన్నారు. ఏ కొనుగోలు కేంద్రానికి అయినా వెళ్లి తెలుసుకో.. ఏ గ్రేడ్ వడ్లను బీ గ్రేడ్‌గా మార్చి రూ.2,369 కొనుగోలు చేశారా లేదా..? అని ప్రశ్నించారు. హమాలీ చార్జీలు రూ.40, లారీ వాళ్లు బస్తాకు రూ.5 వసూలు చేసింది నిజం కాదా అడ్లూరి సమాధానం చెప్పాలన్నారు. రైస్‌మిల్లర్లు తరుగు పేరు మీద లారీకి నాలుగు క్వింటాళ్లు కట్ చేసినా లక్ష్మణ్‌కుమార్‌కు అవినీతిలా కనిపించడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయిందని విమర్శించారు. లక్ష్మణ్ కుమార్ ఏదో ఘనకార్యం చేసినట్టు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి ధాన్యం కొనుగోలు బాగా జరిగిందని.. రైతులకు ఇబ్బందులు కలుగలేదని చెప్పుకోవడం బాధాకరమన్నారు.
అబద్ధాలు చెప్పడం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. అధికారంలో రాకముందు ఏం మాట్లాడారో.. ఇప్పుడేం చేస్తున్నారో.. ప్రజలే గమస్తున్నారని తెలిపారు. మూడు పంటలకు ఇస్తామని చెప్పిన రైతుబంధు జాడేది అని ప్రశ్నించారు. కౌలు రైతులకు భృతి, ప్రతి పంటకు రూ.500బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసింది మీ ప్రభుత్వం కాదా అని ఆగ్రహించారు. యూరియా కోసం దరిద్రమైన విధానాన్ని తీసుకొచ్చింది మీరు కాదా అని మండిపడ్డారు. రాజీనామా చేస్తావో లేదా నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. ఐదేండ్లు అధికారంలో ఉంటే ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని హెచ్చరించారు.