స్మార్ట్ఫోన్ల రాకతో ఇప్పుడు అందరూ ఫొటోగ్రాఫర్లుగా మారిపోయారు. సుందర దృశ్యాలు కనిపించగానే.. ఫోన్ తీసి ‘క్లిక్’మనిపిస్తున్నారు. అయితే, హై రిజల్యూషన్ కెమెరా లేక, క్లారిటీ తగ్గి.. క్వాలిటీని మిస్ అవుతున్నారు. అదే.. ప్రొఫెషనల్ కెమెరాతో ఉండే స్మార్ట్ఫోన్ మీ అరచేతిలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. షావోమీ తన కొత్తఫోన్తో సరిగ్గా అదే చేయబోతున్నది. తన ఫ్లాగ్షిప్ మోడల్ ‘షావోమీ 17 అల్ట్రా’ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కెమెరా ఫీచర్లతోపాటు డిజైన్ పరంగానూ షావోమీ ఈసారి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ.. లైకా సహకారంతో రూపొందించిన 200 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్. సాధారణంగా ఫోన్లలో జూమ్ చేసినప్పుడు డిజిటల్ క్రాపింగ్ వల్ల ఫొటో నాణ్యత తగ్గుతుంది. కానీ, ఇందులో 75 ఎంఎం నుంచి 100 ఎంఎం వరకు కంటిన్యూయస్ ఆప్టికల్ జూమ్ ఉండటం విశేషం. అంటే జూమ్ రేంజ్ మొత్తం పూర్తిస్థాయి 200 ఎంపీ నాణ్యతతో ఫొటోలు తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ కెమెరాలలో వాడే ‘ఏపీవో ఆప్టికల్ సర్టిఫికేషన్’ పొందిన తొలి స్మార్ట్ఫోన్ లెన్స్ కూడా ఇదే!
మరోవైపు స్లిమ్ డిజైన్.. 8.29 ఎంఎం మందంతో ఇప్పటివరకూ వచ్చిన అల్ట్రా సిరీస్ ఫోన్లలో ఇదే అత్యంత స్లిమ్ ఫోన్ అని కంపెనీ చెబుతున్నది. ఇందులో కొత్తగా లైకా వన్-ఇంచ్ ప్రైమరీ సెన్సర్ కూడా ఉంది. తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది. పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీలో నేచురల్ కలర్స్తోపాటు బ్యాక్గ్రౌండ్ బొకే కోసం ప్రత్యేకంగా దీనిని డిజైన్ చేశారు. ధర కొంచెం ఎక్కువే ఉన్నప్పటికీ.. అందించే ఫొటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. ధరకు పూర్తి న్యాయం చేస్తుందని షావోమీ ధీమా వ్యక్తంచేస్తున్నది. మొత్తానికి, స్మార్ట్ఫోన్ కెమెరా అంటే కేవలం మెగాపిక్సెల్స్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా అంటూ.. ‘షావోమీ 17 అల్ట్రా’ నిరూపించబోతున్నది.