Pooja Decoration | అష్టోత్తర నామాలతో పాటు అష్టోత్తర పుష్పాలనూ సమర్పించడం మన పూజా విధానంలో భాగం. నిత్యపూజ కోసం అన్ని పువ్వులు సమకూర్చుకోవడం కష్టమనే ఉద్దేశంతో కొంతమంది రజత పుష్పాలను ఎంచుకుంటారు. నూట ఎనిమిది వెండిపూలు ఓ సెట్టుగా కలువ మొగ్గల ఆకారంలో.. వెండి రంగులో లభించేవి ఇన్నాళ్లూ. ఇప్పుడు, అసలు పువ్వులకు దీటుగా ఎన్నో వన్నెల్లో తయారు చేస్తున్నారు స్వర్ణకారులు.
సువర్ణ, రజతాలకు మన సంప్రదాయంలో పవిత్ర స్థానం ఉంది. ఒకప్పుడు మహారాణులు బంగారు పువ్వులతో పూజలు చేసేవారని అంటారు. కలవారి కోడలిని ఉద్దేశించి, ‘బంగారు పువ్వులతో పూజ చేసుకున్నట్టుంది. ఎంత గొప్ప జీవితం అనుభవిస్తున్నదో!’ అనుకునేవారు. ఇక, ఈ రోజుల్లో బంగారం ప్రియం కావడంతో వెండిపూల సెట్లు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. అచ్చంగా వెండి రంగులోనే కనిపించేవే కాదు, బంగారు పూత పూసినవీ వస్తున్నాయి. వాటిలోనూ వైవిధ్యాన్ని కోరుకునేవారి కోసం ‘ఎనామిల్ ఫ్లవర్లు’ ముస్తాబవుతున్నాయి.
రకరకాల ఆకృతుల్లో, చూడచక్కని వర్ణాల్లో ఎనామిల్ పువ్వుల్ని తయారు చేస్తున్నారు. గులాబీ వన్నెలు చిందించే తామర పూలు, వింత రంగుల్లో విరిసే గన్నేరులు, ఎరుపు, పసుపు వర్ణాల్లో మందారాలు.. ఇలా అనేకరకాల పుష్పాలు వస్తున్నాయి. విభిన్న ఆకృతుల్లో ఆకట్టుకునేలా.. వీటిని తీర్చిదిద్దుతున్నారు. అర్చనకు వాడే నూట ఎనిమిది పువ్వుల సెట్లే కాదు, దేవుడి అలంకరణకు పనికొచ్చేందుకూ రకరకాల పువ్వుల్ని రూపొందిస్తున్నారు.