మగవారితో పోలిస్తే.. మహిళలే పనిభారం అధికంగా మోస్తున్న రోజులివి! ఇల్లాలిగా ఇంటి పనులు చేస్తూనే.. ఉద్యోగ బాధ్యతలనూ సమర్థంగా నిర్వహిస్తున్నారు. రెండు పడవలపైనా ప్రయాణం చేస్తూ.. పోటీ ప్రపంచంలో దూసుకెళ్తున్నారు. అయితే.. ఈ గజి‘బిజీ’ లైఫ్‌లో తమకంటూ సమయాన్ని కేటాయించుకోలేక పోతున్నారు. గంటలకు గంటలు వంటగదిలో గడుపుతున్న తల్లులు.. సమయాన్ని ఆదా చేసుకోవాలంటే.. కింది టిప్స్ పాటించాల్సిందే!
రేపటి వంట కోసం ముందురోజు రాత్రే.. పిల్లలు పడుకున్న తరువాత కూరగాయలను తరుక్కోవాలి. వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి.. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మరుసటిరోజు వంటపని చిటికెలో పూర్తవుతుంది. అయితే, ఆకుకూరలను ఇలా ముందే తరిగి పెట్టుకుంటే.. వాటిలో పోషక విలువలు తగ్గిపోతాయి. అందుకే, అలాంటివాటిని నీళ్లలో కానీ, ఆలివ్ ఆయిల్లో కానీ ‘ఫ్రీజ్’ చేసేయండి. మీకు కావాల్సినప్పుడు డీప్ ఫ్రిజ్‌నుంచి బయటికి తీసి ఉపయోగించుకోండి.
పిల్లలకు బిస్కెట్స్ లాంటి స్నాక్స్ చేయాల్సి వచ్చినప్పుడు వెన్నను ఉపయోగించాల్సి వస్తుంది. అయితే, ఫ్రిజ్‌లో పెట్టిన వెన్న కరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలా కావొద్దంటే.. వెన్నను ముందుగానే తురిమి నిల్వ చేసుకోండి. దీనివల్ల తొందరగా కరిగిపోయి.. సమయం ఆదా అవుతుంది.
కొందరైతే వంట హడావుడిలో ఉప్పు డబ్బా తీయబోయి, చక్కెర డబ్బా ఓపెన్ చేస్తారు. అందుకే.. కిచెన్‌ను ఓ క్రమపద్ధతిలో సర్దుకోండి. ఏయే బాక్సుల్లో ఏమేం ఉన్నాయో ఇట్టే తెలుసుకునేందుకు.. కంటైనర్ బాక్సులపై లేబుల్స్ అతికించండి. దీనివల్ల పదార్థాలను వెతుక్కునే సమయం కలిసొస్తుంది.