BR Ambedkar | స్త్రీ విద్య, సమానత్వం ఆకాంక్షించిన వారిలో అగ్రగణ్యుడు అంబేద్కర్. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నారు. రాజ్యాంగ రచన సమయంలో హిందూ కోడ్ బిల్లును పక్కాగా పార్లమెంట్‌కు సమర్పించారు. ఈ బిల్లులో… ‘స్త్రీ భర్తకు బానిస కాదు, ఆమెకు కూడా భర్తకు ఉండే హక్కులన్నీ ఉంటాయి. ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా ఆస్తి హక్కూ ఉంటుంది. స్త్రీలు సైతం పిల్లలను దత్తత తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు. వారసత్వ ఆస్తిలో దత్త పుత్రుడితో సమానంగా దత్తత తీసుకున్న తల్లికి కూడా హక్కు ఉంటుంది. స్త్రీలు కులాంతర, వర్ణాంతర వివాహాలు చేసుకోవచ్చు.
బహు భార్యత్వం రద్దు. విడాకుల ద్వారా భార్యాభర్తలు వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరికీ వారసత్వ ఆస్తిలో సమభాగాలు దక్కుతాయి’ అంటూ ప్రత్యేకమైన క్లాజ్‌లను రూపొందించారు. వివాహంలో స్త్రీ నిర్ణయాధికారాన్ని సమర్థిస్తూ, స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ రూపొందించిన బిల్లు సంప్రదాయవాదుల్లో ఆగ్రహం కలిగించింది. దీనిని ఆమోదించవద్దంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. పార్లమెంట్‌లోనూ అడ్డు తగిలారు. మార్పులు కోరారు. చర్చ వాయిదా పడుతూ వచ్చింది. మెజారిటీ సభ్యుల మొండిపట్టుతో అంబేద్కర్ విసిగిపోయారు. తన కృషి వృథా అయిపోతున్నందుకు తీవ్రంగా బాధపడ్డారు. 27 సెప్టెంబరు 1951న కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.