అతివ రక్షణకు ఎన్నో అప్లికేషన్లు ప్లేస్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది ‘రక్ష’. జమ్మూకు చెందిన హర్మన్జోత్ సింగ్ అనే ఏడో తరగతి విద్యార్థి 2020లో ఈ యాప్‌ని రూపొందించాడు. ఈ యాప్‌లో భద్రతా చిట్కాలు, మహిళా చట్టాలు, సమాచారం, ఆత్మరక్షణ, SOS అలర్ట్‌తో పాటు అత్యాధునిక చాట్ బాట్ కూడా ఉంది.
‘మహిళలు అత్యంత భద్రతతో, ఎలాంటి భయం లేకుండా జీవించేందుకు, ప్రపంచాన్ని అత్యంత సురక్షితమైన ప్రదేశంగా మార్చేందుకు ఈ యాప్‌ను రూపొందించాను. దీని అభివృద్ధి చేయడానికి ప్రేరణ, ఆలోచన మా అమ్మ నుంచి వచ్చింది. మా అమ్మ వైద్యురాలు. కొన్నిసార్లు అర్ధరాత్రి దాకా క్లినిక్‌లో ఉండాల్సి వస్తుంటుంది. తను ఎక్కడికైనా సురక్షితంగా వెళ్లాలనే ఉద్దేశంతో అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ యాప్‌ని రూపొందించాను’ అంటున్నాడు హర్మన్.
ఈ యాప్‌లో ఉండే SOS బటన్ క్లిక్ చేయడం ద్వారా తక్షణమే పోలీసులు, ఇతర అత్యవసర మహిళా హెల్ప్లైన్లకు కాల్ వెళ్తుంది. అలాగే చుట్టూ పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయనిపిస్తే.. యాప్‌లో ఎంచుకున్న నెంబర్లకు సెకన్ల వ్యవధిలో అలెర్ట్ మెసేజ్ పంపొచ్చు. చాట్‌బాట్ ద్వారా మెసేజ్ టైప్ చేసే పనిలేకుండావాయిస్ టైపింగ్ ఆప్షన్ కూడా ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది. తన తల్లి కోసం యాప్ డిజైన్ చేసి యావత్ మహిళా లోకానికి ‘రక్ష’గా నిలిచిన హర్మన్‌ను బాల పురస్కార్ అవార్డు కూడా వరించింది.