పగలు, రాత్రి.. పల్లె, పట్నం.. అనే తేడా లేకుండా మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. బయటికి వెళ్లినవాళ్లు ఇంటికి వచ్చే వరకు గండంగానే ఉంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కఠినమైన చట్టాలు అమలుచేస్తున్నా నేరాలు అదుపులోకి రావడం లేదు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంకేతికత సాయంతో ఈ నేరాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు, టెక్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే పలు సేఫ్టీ యాప్‌లను రూపొందిస్తున్నాయి. అటువంటిదే ఈ ‘నూన్‌లైట్’ యాప్.
కొత్త వారిని కలవడానికి వెళ్లినప్పుడైనా, ఒంటరిగా ప్రయాణం సాగిస్తున్నప్పుడైనా మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని భావిస్తే ఈ నూన్‌లైట్ యాప్‌తో చిటికెలో పోలీసులకు సమాచారం అందుతుంది. మీ మొబైల్లో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. మీ ప్రయాణంలో ప్రమాదం పొంచి ఉందన్న అనుమానం రాగానే యాప్‌లోని ‘అన్‌సేఫ్’ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. ఒకసారి మీరు సేఫ్‌గా ఉన్నారు అనిపిస్తే బటన్‌ను వదిలేసిన వెంటనే నాలుగు అంకెల పిన్ను ఎంటర్ చేయాలి. అదే, మీరు ప్రమాదంలోనే ఉన్నట్టయితే బటన్‌ను రిలీజ్ చేసిన అనంతరం పిన్ నంబర్ ఎంటర్ చేయకూడదు. దాంతో వెంటనే ఎమర్జెన్సీ సహాయాన్ని పొందే విధంగా మీ లొకేషన్, సమాచారం పోలీసులకు చేరిపోతుంది. తక్షణ రక్షణ చర్యలు మొదలవుతాయి.