అమృతఫలం
తీయని పండ్లు ఎన్నో ఉన్నాయి. ఆ తీయని పండ్లలో సీతాఫలానికి సాటి రాగల ఫలం మరోటి లేదు. సీతాఫలం తీపిలో రారాజు. సీతాఫల చెట్టు తెలంగాణలో అన్నిచోట్లా కనిపిస్తుంది. అత్యల్ప వర్షపాతం ఉండే భూముల్లో సీతాఫల మొక్కలు సహజంగానే పెరుగుతాయి. ఇది చిన్న వృక్షం. వర్షాకాలంలో కాయడం మొదలవుతుంది. దసరా, దీపావళి వరకు కాస్తాయి. సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే సీతాఫలాలు దొరుకుతాయి. సీతాఫలం లేత ఆకుపచ్చ రంగులో బొడిపెలతో గుండ్రంగా ఉంటుంది. తెల్లని గుజ్జులో అనేక విత్తనాలుంటాయి. అత్యంత తీయనైన సీతాఫలాన్ని గింజలు మింగకుండా తినడం ఓ కళ. పీవీ వనంలో సీతాఫలం, రామ సీతాఫలం, లక్ష్మణ సీతాఫలంతోపాటు సోర్ ఫ్రూట్ అని పిలిచే ఇంకోరకం ఔషధ సీతాఫల చెట్టు కూడా ఉంది.
ఓ క్యాన్సర్ రోగి కోసం తెప్పించిన సోర్ఫ్రూట్ గింజల్లో ఒకటి ఇక్కడ మొలిచింది. అది ఈ మధ్యే కాస్తున్నది. తొక్క ముళ్లలా ఉంది. లోపలి గింజలు కూడా సీతాఫలం గింజల్లాగే ఉన్నాయి. వాసన కూడా అలాగే ఉంది. రుచి మాత్రం తీపిలో చింతపులుపు కలిసినట్టుగా ఉంటుంది. రామసీతాఫలం తొక్క బొడిపెలుగా ఉన్నా గరుకుగా ఉండకుండా, గళ్ల గీతలు ఉంటాయి. గింజలు తక్కువగా ఉండి, రుచి అతి మధురంగా ఉంటుంది. సీతాఫల చెట్లు దేశమంతటా ప్రకృతిసిద్ధంగా పెరుగుతాయి. శ్రీకాకుళం ప్రాంతం సీతాఫలాలకు ప్రసిద్ధి. మన దేశంలో సీతాఫలాన్ని వాణిజ్య పంటగా పెంచుతున్నారు. రైతులకు ఇది లాభదాయకమైన పంట.
ఈ మధ్య సీతాఫలాలతో స్వీట్లు, జెల్లీలు, ఐస్‌క్రీమ్‌లు, జామ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని మొజంజాహి మార్కెట్లో సీతాఫల్ ఐస్‌క్రీమ్ తినేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సీతాఫలం ఆకులు, బెరడు, వేళ్లు ఔషధ విలువలు కలిగినవే. సీతాఫల ఆకులు మధుమేహాన్ని తగ్గిస్తాయి. ఒంటినొప్పులు, ముఖ్యంగా అరికాళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తాయి. సీతాఫల ఆకులను అరికాళ్లకు కట్టుకొని నిద్రపోతే తెల్లారేసరికి ఉపశమనం కలుగుతుంది. సీతాఫలం తింటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఇందులో ఫాస్పరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మా చిన్నప్పుడు పోటీలు పడి ఈ పండ్లు సాయంత్రాలు తిని ఆటలకు పోయేవాళ్లం. సీతాఫలాలను సీజన్లో తినండి. ఎదిగే పిల్లలకు తినిపించండి.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు