బరువు తగ్గాలనుకునేవాళ్లు రకరకాల డైట్ ప్లాన్లు ఫాలో అవుతుంటారు. పక్షం రోజులు పని గట్టుకొని కడుపు మాడ్చుకుంటారు. లాభం లేదనుకొని మళ్లీ వెనక్కి తగ్గుతారు. కానీ, వెయిట్ లాస్ కోసం తహతహలాడుతున్న వారికోసం ఇప్పుడు నయా ట్రెండ్ ఒకటి పరిచయమైంది. అదే మోనో డైట్. ఈ విధానంలో రోజంతా గానీ, ఒక భోజనంలో గానీ ఒకే రకమైన ఆహారం తీసుకోవడమే మోనో డైట్ సూత్రం. ఉదాహరణకు ఒక రోజు కేవలం అరటిపళ్లు మాత్రమే ఆరగించాలి. ఇంకోరోజు కేవలం గుడ్డు వెరైటీలపై ఆధారపడాలి. ఇలా చేయడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చని కొందరు చెబుతున్నారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది సెలెబ్రిటీలు దీన్ని ఫాలో అవుతున్నారు. ఆ స్టార్లను అభిమానించే వాళ్లు సైతం ఈ విధానానికి జై కొడుతున్నారు. ఈ పద్ధతిలో బరువు తగ్గడం సాధ్యమేనా అంటే.. భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొదట్లో బరువు తగ్గినట్టు అనిపించినా, మోనోడైట్ వల్ల నష్టాలే ఎక్కువ అంటున్నారు పోషకాహార నిపుణులు. ‘ఈ డైట్ వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలూ అందవు. ఫలితంగా దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి’ అని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, మోనోడైట్ వల్ల శరీర మెటబాలిజం మందగిస్తుంది. సరైన ప్రొటీన్లు, ఫైబర్ లేని ఆహారం వల్ల కండరాల శక్తి తగ్గుతుంది. బరువు తగ్గడం మాట అటుంచితే.. జీవక్రియలు పట్టు తప్పే ప్రమాదం ఉందంటున్నారు. పైగా, ఈ తరహా డైట్‌ను మొదట్లో ఉత్సాహంగా పాటించినా.. పోనుపోనూ బోర్ కొట్టేస్తుంది. ఇలాంటి షరతులతో కూడిన డైట్ దీర్ఘకాలం కొనసాగించడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. మొండిగా పాటించినా.. మోనోడైట్ వల్ల ప్రయోజనాల కన్నా దుష్పరిణామాలే ఎక్కువని వాళ్లు తేల్చి చెబుతున్నారు.
కొన్ని రోజులపాటు ఈ డైట్ ఫాలో అయితే బరువు తగ్గినట్టు అనిపించవచ్చు. కానీ, ఇది ఎక్కువగా శరీరంలో నీటిని తగ్గిస్తుందే కానీ, కొవ్వును కరిగించదని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ రెగ్యులర్ డైట్‌కు మళ్లినప్పుడు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తగినంత శారీరక శ్రమ చేస్తుంటే.. క్రమపద్ధతిలో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల, మోనోడైట్కు బదులుగా పోషకాలన్నీ సమతులంగా ఉండే ఆహారం తీసుకుంటేనే మేలు.