Health Tips | ఆరోగ్య రహస్యాలు చాలా చదువుతుంటాం. కానీ రహస్యమైన ప్రదేశాల ఆరోగ్యం మాత్రం అస్సలు పట్టించుకోం. ముఖ్యంగా ఆడవారు ఇలాంటి విషయాలను తమలో తాము చర్చించుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ చక్కని ఆరోగ్యానికి, సుఖకరమైన జీవనానికి వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం. మనం ఆ విషయంలో ఎంత శ్రద్ధపెడితే, అంత హాయిగా ఉండొచ్చు. నేటి జీవనశైలి, మారుతున్న వస్త్రధారణ ఆడపిల్లలకు రకరకాల ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నాయి. వాటి గురించి అవగాహన తెచ్చుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే రహస్యంగా బాధపడాల్సిన విషయాలేమీ ఉండవు.
ఇటీవలి కాలంలో ఆడపిల్లలు బిగుతైన బట్టలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా జీన్స్, లెగ్గింగ్‌ల లాంటివి కాలి నుంచి నడుము భాగం దాకా ఎక్కడికక్కడ పట్టేసి ఉంటున్నాయి. ఇవి వ్యక్తిగత భాగాల ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. చల్లటి వాతావరణం ఉండే పడమర దేశాల వాళ్లు శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడం కోసం ఇలా మందంగా, బిగుతుగా ఉండే దుస్తులను వేసుకుంటారు. కానీ మనది ఉష్ణదేశం. ఇక్కడ వేడి వాతావరణం ఉంటుంది. శరీరానికి గాలి ఆడేలా పల్చగా, వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. ముఖ్యంగా స్త్రీల జననాంగాలు సహజంగా తడిగా ఉంటాయి. కాబట్టి అక్కడ కాస్త పొడిగా ఉంచేందుకు సాయపడేలా వదులైన దుస్తులు వేసుకోవాలి. మన చీరకట్టు వెనక రహస్యం అదే. అయితే ఇటీవల చీర కట్టుకునేవారూ బిగుతైన లోదుస్తులు ధరిస్తున్నారు. దీనివల్ల నష్టమే తప్ప లాభమేం లేదు.
లోదుస్తులు కూడా వదులైనవే ఎంచుకోవాలి. నూలుతో చేసిన వాటిని ధరించాలి. రోజూ రెండుపూటలా వాటిని మార్చుకోవాలి. నిజానికి రాత్రి పూట లోదుస్తులు ధరించకుండా వదిలేయడం మంచిది. దానివల్ల తడిపొడిగా ఉండే వ్యక్తిగత భాగాలకు కొంచెం గాలి తగులుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉండొచ్చు. ఇటీవల ఇన్ఫెక్షన్ల కారణంగా డాక్టర్ల దగ్గరికి వస్తున్న ఆడపిల్లల సంఖ్య నానాటికీ అధికం అవుతున్నది. వేడిని శోషించుకునేలా నలుపు, నీలంలాంటి ముదురు రంగుల ప్యాంట్లు ఎక్కువగా ధరించవద్దు. అలాగే లోదుస్తులూ లేత రంగులే వేసుకోవాలి. ఇది కూడా వ్యక్తిగత భాగాల సంరక్షణలో భాగంగానే పరిగణించాలి.
ఈ మధ్యకాలంలో తామరలాంటి ఇన్ఫెక్షన్లతో వస్తున్న అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. వ్యక్తిగత భాగాలతోపాటు, పిరుదుల దగ్గర కూడా వచ్చే ఈ ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. పక్కవారి దుస్తులు ధరించడం వల్ల ఎక్కువగా ఇలాంటి వ్యాధులు సోకుతాయి. కాబట్టి ఎవరి బట్టలు వాళ్లే వేసుకోవడం, రోజూ స్నానం చేయడం ముఖ్యం. అలాగే హాస్టళ్లలో ఉండేవాళ్లయితే అండర్వేర్లాంటివి ఆరేసేటప్పుడు ఎవరికి వాళ్లు ప్రత్యేకంగా, విడిగా ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఒకరినుంచి ఒకరికి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూసుకోవచ్చు. అలాగే ఇలాంటి సందర్భాల్లో నేరుగా మెడికల్ షాప్‌కి వెళ్లి తెచ్చుకొని క్రీములు వాడుతున్నారు. వాటిలో స్టెరాయిడ్లు ఉంటున్నాయి. దీనివల్ల అప్పటికప్పుడు తగ్గినా తర్వాత అది మందులకు లొంగకుండా తయారవుతుంది. రోజూ స్నానం చేయడం, రోజుకు రెండుసార్లు కనీసం లోదుస్తులు మార్చుకోవడం అత్యవసరం. మూత్రానికి వెళ్లినా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకకు నీళ్లతో శుభ్రపరచుకోవాలి. వెనక నుంచి ముందుకు కడగడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
వెస్ట్రన్ టాయిలెట్లు వాడటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఈ టాయిలెట్ వాడాక ప్రతి ఒక్కరూ కమోడ్‌పై భాగాన్ని టిష్యూతో శుభ్రం చేయాలి. చేతులు కడుక్కోవాలి. చాలామంది వెస్ట్రన్ టాయిలెట్ల విషయంలో ఇది పాటించరు. ఇక, పబ్లిక్ టాయిలెట్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇటీవల వ్జైనల్ వాష్‌ల పేరుతో జననాంగాలను శుభ్రపరచుకునేందుకు ప్రత్యేక ద్రవాలు వస్తున్నాయి. సాధారణంగా జననాంగం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను దరిచేరనీయకుండా కాపాడుతుంది. కానీ క్షార స్వభావం ఉండే ఈ వాష్‌లు వాడటం వల్ల దాని ఆమ్ల స్వభావం దెబ్బతింటుంది. ఆ ప్రాంతం పొడిబారిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. అక్కడ జిగురు పదార్థం లేకుండా పొడిబారడం వల్ల కలయిక కూడా ఇబ్బందిగా మారుతుంది. కనుక, జననేంద్రియాల బయటి ప్రాంతాన్ని రోజులో ఒక్కసారి సబ్బుతో కడిగితే చాలు. లోపలంతా శరీరమే స్వయంగా శుభ్రపరచుకుంటుంది. అనవసరంగా యోని ప్రాంతాన్ని అతిగా శుభ్రపరచడం అన్నది ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్న ఒక ముఖ్య కారణం. అతిగా కడగడం వల్ల అది దాని సహజ స్వభావాన్ని కోల్పోతుంది.
కలయిక ముందు .. లేదా కలిశాక ఆ భాగాలను శుభ్రపరచుకోవాలన్న నియమమేం లేదు. వీలైతే రోజుకు రెండు సార్లు సాధారణంగా స్నానం చేసి శుభ్రంగా ఉంటే చాలు. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లలో రక్తంలో చక్కెర స్థాయులు అదుపు తప్పినప్పుడు వ్యక్తిగత భాగాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. భర్తకు ఉంటే భార్యకు, భార్యకు ఉంటే భర్తకు ఇవి సంక్రమిస్తుంటాయి. నిజానికి మగవాళ్లతో పోలిస్తే స్త్రీలలో ఆ భాగపు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వీళ్లకే ఎక్కువగా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో కండోమ్లాంటివి వాడటం మంచిది. అయితే ఆడవాళ్లలో కనిపించే చాలా రకాలు రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లే. కొంతమంది వాటిని సుఖవ్యాధులుగా పొరబడుతుంటారు. అది నిజం కాదు. అసలు ఆ సమస్య ఏమిటన్నది తప్పకుండా డాక్టర్ని సంప్రదించి తెలుసుకొని సరైన మందులు వాడాలి.
చిన్నపిల్లలు… అంటే ఇంకా రజస్వల కాని పిల్లలు… జననేంద్రియాల్లో దురద ఉంది అంటూ వస్తున్నారు. అలాంటి ఇబ్బందులు ఏం ఉన్నా… తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ల మీద ఏదైనా లైంగిక వేధింపులు జరుగుతున్నాయా అని గమనించాలి. అవసరమైతే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. బస్సుల్లో అయినా సరే స్కూల్‌కి పంపేటప్పుడు ఆడవాళ్లు అటెండర్‌గా ఉండేవి ఎంచుకుంటే మంచిది.
చిన్నపిల్లలకు కూడా వదులుగా ఉండే లోదుస్తులే వేయాలి. అలాగే ఉదయం స్నానం చేయించాక వేయడంతోపాటు, బడి నుంచి ఇంటికి రాగానే వాటిని మార్చాలి. రాత్రి పూట అసలు వేయకపోవడం మంచిది. ఆ సమయంలో పైజామాల్లాంటి కాటన్ బట్టలు వేయొచ్చు.
అలాగే ఆడపిల్లలు, మహిళలు అందరిలో ప్యాంటీల మీద మరకలు కనిపించడం సహజమే. జననేంద్రియాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి కనుక ఆ కారణంగా ఈ ప్రాంతంలో ప్యాంటీల రంగు పోతుంది. కనుక ఇలా మరకలు కనిపించడం అన్నది ఆరోగ్యంగా ఉన్నారన్నదానికి చిహ్నమే. కాబట్టి ఈ విషయంలో భయపడనక్కర్లేదు.
నెలసరి సమయంలోనూ వ్యక్తిగత భాగాల పరిశుభ్రత చాలా అవసరం. ప్యాడ్లు మార్చుకునే ముందు, ఆ తర్వాత రెండు సార్లూ సబ్బుతో చేతుల్ని శుభ్రపరచుకోవాలి.
ప్యాడ్ లేదా నాప్కిన్ మొత్తం తడిసిపోయేదాకా ఆగకూడదు. మోస్తరు స్రావం అవ్వగానే మార్చుకోవాలి. సాధారణ స్రావం అయ్యేవాళ్లు రోజుల్లో మూడు సార్లు (ప్రతి ఏడెనిమిది గంటలకు ఒకసారి) మార్చుకుంటే సరిపోతుంది. కొందరు శుభ్రత పేరుతో రెండు గంటలకోసారి మారుస్తూ ఉంటారు. తీవ్ర రక్తస్రావం అయ్యేవారిలో మినహా అది అనవసరం. పైగా పర్యావరణానికి హాని కూడా. మెన్స్ట్రువల్ కప్ వాడినా స్రావాన్ని బట్టి నాలుగు నుంచి ఎనిమిది గంటల మధ్యలో దాన్ని ఖాళీ చేసి శుభ్రపరచుకోవాలి.