నడకతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్న విషయం తెలిసిందే! అయితే.. అదే నడక ఆయుష్షునూ పెంచుతుందని ఇటీవల ‘లాన్సెట్’ చేసిన అధ్యయనం తేల్చింది. రోజుకు 7,000 అడుగులు నడిచే వ్యక్తుల్లో జీవన ప్రమాణాలతోపాటు ఆయుష్షు కూడా మెరుగుపడుతుందని ఇందులో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 1.6 లక్షల మందితో ఈ సర్వే నిర్వహించారు. రోజుకు రెండు వేల అడుగులు నడిచేవారితో పోలిస్తే.. ఏడు వేల అడుగులు నడిచే వారికి మరణ ముప్పు 47 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు.
ఆయుష్షుతోపాటు వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అంటున్నారు. వీరికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 25 శాతం తగ్గుతుందనీ, హృదయ సంబంధ వ్యాధులతో మరణించే అవకాశం 47 శాతం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 38 శాతం, డిప్రెషన్ లక్షణాల ప్రమాదం 22 శాతం తగ్గుతుందట. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 14 శాతం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం 6 శాతం, డిప్రెషన్ రిస్క్ 22 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అధ్యయనకారులు వెల్లడించారు. కాబట్టి, నడకను నిర్లక్ష్యం చేయొద్దనీ, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 7,000 అడుగులు నడవాలనీ సూచిస్తున్నారు.