బడ్జెట్ వినియోగదారుల కోసం ‘వివో ఇండియా’ ఓ కొత్త ఫోన్ తీసుకొచ్చింది. రోజువారీ వినియోగంతోపాటు వినోద అనుభవాన్ని అందించేలా.. ‘వివో టీ5ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత.. దీని భారీ బ్యాటరీ. ఇందులో 5500 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 18 గంటల ఆన్లైన్ వీడియోలు చూసుకోవచ్చు. 47 గంటల మ్యూజిక్ వినడంతోపాటు 13.5 గంటల పాటు సోషల్ మీడియాలో గడపొచ్చు. 28 గంటల వాయిస్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఈ బ్యాటరీ 15W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. మరో ముఖ్యమైన ఫీచర్.. బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండర్.
1 శాతం బ్యాటరీ ఉన్నప్పుడు అత్యవసర వినియోగం కోసం బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. అత్యాధునిక ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేసేలా.. ఇందులో UNISOC T7225 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను వాడారు. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. స్టోరేజ్‌ను 2టీబీ, ర్యామ్‌ను 8 జీబీ వరకూ పెంచుకునే అవకాశం ఉన్నది. ఫొటోల కోసం వెనక భాగంలో 8 ఎంపీ, సెల్ఫీల కోసం ముందు 5ఎంపీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్క్రీన్ విషయానికి వస్తే.. 6.74 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. 90Hz స్మూత్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అంతేకాదు.. ఇందులోని ‘స్లీప్ కంఫర్ట్ మోడ్’ సపోర్ట్ వల్ల కంటికి ఏమాత్రం అలసట కలగనీయదు.
ఇక ఇందులోని వెట్ హ్యాండ్, గ్రీజీ హ్యాండ్ టచ్ సపోర్ట్ మరో ప్రత్యేకత. చేతులకు నీళ్లు, నూనె జిడ్డు ఉన్నా.. టచ్‌స్క్రీన్‌ను చక్కగా వాడుకోవచ్చు. రక్షణ విషయానికి వస్తే.. ఐపీ 64 రేటింగ్‌తో వస్తున్నది. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. మిలిటరీ గ్రేడ్ అల్యూమినియంతో తయారవ్వడం వల్ల.. ప్రమాదవశాత్తు కిందపడినా తట్టుకుంటుంది. షాడో గ్రే, ఏరో బ్లూ రంగుల్లో లభిస్తున్న ఉన్న ఈ ఫోన్ ధర.. రూ.13,999. వివో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.