Vitamin D | ప్రకృతి సిద్ధంగా లభించే దివ్యౌషధం విటమిన్ డి. నయాపైస ఖర్చులేకుండా సూర్య కిరణాలు తెచ్చి ఇచ్చే విటమిన్ ఇది. కానీ, మెట్రో నగరాల్లో ఎండ కన్నెరగక ఎందరో డి విటమిన్ లోపానికి గురవుతున్నారు. మహానగరాల్లో ఉండే 80 శాతం మంది మహిళలు, చిన్నారుల్లో విటమిన్ డి లోపం ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నగరాల్లో లేత ఎండ ఇంట్లోకి చొరబడే అవకాశం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనదేశ జనాభాలో 50 శాతం మందికి విటమిన్ డి లోపం ఉందని అంచనా.
ఇందులో 30 శాతం మంది చిన్నారులు, యువత ఉండటం ఆందోళన కలిగించే విషయం. విటమిన్ డి శరీరానికి సరిపడా అందకపోతే రోగనిరోధకశక్తి తగ్గుతుంది. నీరసం ఆవహిస్తుంది. ఎముకలు బలహీనమవుతాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి వందలు వెచ్చించి విటమిన్ డి సప్లిమెంట్స్ కొంటున్నారు కూడా! అయితే, ఔషధాలపై ఆధారపడటం కన్నా… పొద్దున్నే ఓ ఇరవై నిమిషాల పాటు ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవడమే మంచిదని పరిశోధకులు సెలవిస్తున్నారు.