ఇటీవలి కాలంలో వెజిటబుల్ సలాడ్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. వాటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏ సమయంలో తినాలి? వారంలో ఎన్నిసార్లు తినాలి?
-పాఠకురాలు
కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు, సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే బీపీ, మధుమేహం, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ తదితర సమస్యల పరిష్కారానికి ఇవి ఎంతో సహకరిస్తాయి. వీటన్నిటికీ మూలకారణమైన ఊబకాయాన్ని వదిలించుకునేందుకు సాయ పడతాయి. వీటివల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుంటుంది. త్వరగా నీరసం రాదు. వెజిటబుల్ సలాడ్స్‌ను మధ్యాహ్న భోజనానికి ముందు తింటే మంచిది. అల్పాహారం- మధ్యాహ్న భోజనం మధ్య కానీ, రెండు భోజనాల విరామంలో చిరుతిండిలా కానీ తీసుకోవచ్చు. ఒకవేళ పచ్చివి తినలేకపోతే కాస్త ఉడికించి ఆరగించవచ్చు. సన్నటి ముక్కలుగా తరిగి పెరుగులో కలుపుకొని లేదా పచ్చడిలో అద్దుకొని ఆరగించొచ్చు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, క్రాన్స్ డిసీజ్ తదితర సమస్యలు ఉన్నవాళ్లు పోషకాహార నిపుణుల సలహా మేరకే తీసుకోవాలి. రోజూ కనీసం ఒకసారి, వీలైతే రెండుసార్లు సలాడ్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com