ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే! అయితే, ప్రమాదాల్లో అండగా నిలిచే ఈ అతిముఖ్యమైన పరికరం.. జుట్టు ఆరోగ్యాన్ని మాత్రం తీవ్రంగా దెబ్బతీస్తుంది. చుండ్రుతోపాటు నెత్తిమీద మొటిమలకూ కారణం అవుతుంది. హెల్మెట్ శుభ్రత పాటించకపోతే.. జుట్టు తెగిపోవడం, చికాకు లాంటి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. దీనిని నివారించడానికి ఈ చిట్కాలు పాటించండి.
హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్.. దుమ్ముదూళితోపాటు నూనె, చెమటను ఎక్కువగా గ్రహిస్తుంది. రెగ్యులర్‌గా శుభ్రం చేయకపోతే.. దానిపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరుగుతాయి. దీర్ఘకాలంలో చుండ్రుతోపాటు దురదను కలిగిస్తుంది. అందుకే, హెల్మెట్ లైనర్ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
నెత్తికి సన్నని, గాలి పీల్చుకునే కాటన్ క్యాప్ ధరించాలి. ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే.. జుట్టు-హెల్మెట్ మధ్య రక్షణ కవచంగా పనిచేస్తుంది. అంతేకాదు.. ప్రయాణాల్లో వచ్చే చెమటను గ్రహిస్తుంది. హెల్మెట్‌ను బ్యాక్టీరియా, ధూళితో కలవకుండా నిరోధిస్తుంది. జుట్టు విరిగిపోవడాన్ని, తలపై చికాకునూ తగ్గిస్తుంది.
హెల్మెట్ మీ వ్యక్తిగత వస్తువని గుర్తించుకోండి. దీనిని మీ ఇంట్లోవారితోనో, స్నేహితులతోనే పంచుకోవడం మంచిదికాదు. అలాచేస్తే.. చుండ్రు, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతుంది. ఇది ప్రమాదాన్ని పెంచుతుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో హెల్మెట్ పంచుకున్నా.. తలకు టోపీగానీ, రుమాలు కానీ ధరించాలి.
బయటికి వెళ్లేముందు హెయిర్ ఆయిల్, జెల్, వ్యాక్స్ రాసుకోవడం మానేయాలి. అవన్నీ నెత్తికి పెట్టుకొని హెల్మెట్ ధరిస్తే.. సమస్య ఎక్కువ అవుతుంది. జుట్టు కుదుళ్లలోని రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది పగుళ్లు, చికాకుకు దారితీస్తుంది.
రోజూ ఎక్కువ సమయంపాటు హెల్మెట్ ధరించేవాళ్లు.. జుట్టు శుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. చెమట, దుమ్ము, నూనె, కాలుష్యం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి, ఎక్కువసేపు బైక్ నడిపిన తర్వాత జుట్టును కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. తలపై ఉండే సహజ నూనెలు దెబ్బతినకుండా.. సున్నితమైన, సల్ఫేట్ లేని షాంపూలను ఎంచుకోవాలి.