ఎరువుల కోసం ఎడతెగని ఎదురు చూపులు… విత్తనాల కోసం పడరాని పాట్లు… అమ్మకానికి అంతకు మించిన అగచాట్లు… నేడు రాష్ట్రమంతా రైతన్నలు ఎదుర్కొంటున్న పరిస్థితులు. కానీ, ఇలాంటి రోజు ఎప్పటికీ రాకూడదు అనుకుంటూ తామే సొంతంగా విత్తనాలనూ, ఎరువులనూ సమకూర్చుకుంటూ ప్రగతి పథంలో సాగుతున్నారు సంగారెడ్డి జిల్లా బిడెకన్న గ్రామ మహిళా రైతు జడల చిన్న చంద్రమ్మ. తెలంగాణ దక్కన్
డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రంతో కలిసి పనిచేస్తున్న ఆమె 70కి పైగా విభిన్న రకాల విత్తనాలను తన దగ్గర నిల్వ చేస్తారు. పంటలు, వ్యవసాయం, రైతుల గురించి పాటలు కట్టి రేడియోలో పాడతారు. మూడు దశాబ్దాలకు పైగా సేంద్రియ వ్యవసాయంలో విజయవంతంగా కొనసాగుతున్న ఆమెతో మహిళా రైతు దినోత్సవం సందర్భంగా జిందగీ మాట కలిపింది.
ఇది మా తాతలు చెప్పిన్రు, మా అత్త మామలు చెప్పిన్రు. సంఘమోల్లు చెప్పిన్రు. ఇప్పుడు పెద్ద మనుషులంతా చెబుతున్నరు. మనం తినే నాలుగు మెతుకులన్న సత్తువున్న తిండి తినాలె. లేకపోతే లేనిపోని నొప్పులు, చెప్పరాని రోగాలు. అందుకనే నేను, నా మగడు ఇద్దరం మొదాట్నుంచి మందుల్లేని పంటలే పండిస్తున్నం. మందుకొట్టకపోతే దిగుబడి తక్కువ వస్తది, పంట చేతికి రాదు అంటరు. అందుల నిజం లేదు. పండిచ్చే తీరుగ పండిస్తే మస్తుగ వస్తది పంట. ఇట్ల పండిచ్చే పంటకు ఇప్పుడు మంచిగ డబ్బులు కూడా ఇస్తున్నరు సంఘం (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) వాళ్లు. అట్లకాబట్టి తక్కువ పంటచ్చినా రైతుకు ఇబ్బంది ఉండదు. మనకి ఈ పంటలు జర్ర రేటు అనిపిస్తయి కావచ్చు. కానీ మందుల తిండి తింటే…. మళ్లీ మందులకు పెట్టద్దా డబ్బులు. పైన ఇంక రోగాలు జమ. అందుకే మేం ఎప్పుడు పంటకు మందు కొట్టం.
నాకు పదెక్రాల నేల ఉన్నది. అందుల కొంచెం మామిడితోట. కొంచెం చెరకు తోట. మిగతా నేలల్ల పంటలేస్తం. వ్యవసాయం చేయాలంటే ముందు మనతాన విత్తనాలు ఉండాలె. నా దగ్గర వానాకాలం పంటలవి అంటే … పచ్చజొన్న, కొర్ర, సామ, ఉలవ, నువ్వుల్లాంటివి మొత్తం 40 రకాల విత్తనాలు ఉన్నయి. రబీ పంటకు మల్ల 30 రకాలకు పైన విత్తనాలు ఉన్నయ్. అన్ని నా ఇంట్లనే దాస్త. ఈ విత్తనాలు చానా రోజులు మంచిగుండేలెక్క గుమ్ముల్లో దాస్తం. వేపాకు పరుస్తం. పిడకలు జేసి వాటిని బూడిద జేసి, వేపాకు పొడి జేసి, ఆ గింజలు కలిపి నిల్వ ఉంచుతం. మళ్లీ ఏడాది మంచిగ పంటేయాలంటే విత్తనాలు నిల్వ ఉంచుడు కూడా మనం మంచిగ తెల్సుకోవాలె.
ఇంకోముచ్చటేందంటే, పంట ఏసినంక దానికి బలం ఉండాలె కదా. మరి ఎరువులెట్ల అంటరా? మేం ఏడాది పొడుగునా ఎవుసం జేస్తం. ఇప్పుడు శనగ పంట ఏసినం, నువ్వులు పండిచ్చినం… అయితే కోత అయినంక చెట్లు అట్లనే ఒదిలివెడ్తం. ఆ ఆకులన్ని రాలుతయి కదా… అక్కడే ఎండిపోతయి… అవన్నీ మళ్లీ భూమిలో కలుస్తయి. అవే మళ్లీ పంటకు ఎరువన్నట్టు. మా ఇంట్ల ఆవులున్నయ్, మేకలున్నయ్. ఆ పెంట అంత ఒక్కచోట ఏసుకుంటం. రెండేండ్లకు ఒకసారి నేలకు చల్లుతం. అది చాన బలం. పంటలు కూడా మార్చి మార్చి ఎయ్యాలె. ఎప్పుడూ ఒక్క తీరు పంట ఎయ్యొద్దు. ఇట్ల మనం నేలను సత్తువతోని ఉంచుకుంటే పంటలు మంచిగ పండుడే కాదు, పురుగులు కూడా పట్టవు. మేం రైతులందరం కల్సి సంఘం దగ్గర వేపనూనె, వెల్లుల్లిపాయలాంటివాటితో మందు జేస్తం. ఒకవేళ పురుగు పడ్తె… ఆ మందు పట్టుకొచ్చి చల్లుతం. ఇంకొకటి ఏందంటే బెల్లం నీళ్లు. చెట్టుకు పురుగు పట్టిందంటే పెద్ద డ్రమ్ముల్లల్ల నీళ్లు నింపి బెల్లం కలిపి పంట మీద చల్లుతం. గండుచీమలొస్తయ్ కదా… పురుగుల్ని గుంజుకపోయి తింటయ్యన్నట్టు.
మా ఊళ్ల రకరకాల నేలలున్నయ్. నాలుగు రకాలైతే కనీసం ఉన్నయ్. నల్ల భూమి, జిరుగు నేల, ఎర్ర భూమి, రాళ్ల నేల… ఇట్ల. ఎందుల ఏం పంటలు పండుతయో అవ్వే తియ్యాలె. కార్తెను బట్టి పంట ఎయ్యాలె. చినుకు పడ్డప్పుడు ఒకటి, పడనప్పుడు ఒకటి. కొన్ని పంటలు అంటే జొన్న, శనగ, నల్ల కుసుమ, తెల్ల కుసుమలాంటి పంటలు గాలికి పండుతయ్. అంటే వాటికి ఆనల్తోని, నీళ్లతోని పన్లేదు. అవి గిప్పుడు ఇట్ల చలికాలంలో ఎయ్యాలె. సంఘంలో కూడా ఈ సంగతులన్నీ చెబుతరు. మా సంఘానికి రేడియో ఉన్నది. అందులో మాలాంటి మహిళా రైతులందరం మాట్లాడుతం. పంటలు, వర్షాలు ఎండలు, విత్తనాలు, కుటుంబాల్లో జరిగే సంగతులు ఇవ్వన్నీ అందుల మాట్లాడుతం.
నేను కూడా ఏం పంట పెట్టిన, ఎక్కడి దాకా పెరిగింది, ఏమన్నా గింజలు పెట్టినయి.. వర్షాలకు కొట్టకపోయినయా! ఇట్ల కష్టం సుఖం మాట్లాడుతుంట. నేను మా రేడియోలో పాటలు కూడా పాడుతా. ‘నల్లాయి సామలు నల్లాయి సామలు… నల్లనల్లని సామలూ… తింటే పెయ్యికెంత బలమందురు పెద్దమనుషులు… ఎర్రాయి కందులు… ఎర్రాయి కందులు…’ తర్వాత జొన్నలు, కొర్రలు… ఇట్ల చిరుధాన్యాలన్నీ కలుపుతూ పాటకట్టి పాడతాం. విత్తనాల మీద చాన పాటలొచ్చు. అంతేకాదు పంటలు, చేలు, మేం చేసే వ్యవసాయం పనులు, మా దగ్గర జరిగే విత్తనాల జాతర, మా సంఘం… ఇట్ల అన్నింటి మీదా పాటలు పాడుతాం. మా జట్టులో అయిదుగురం ఉన్నం. మేం చదువుకోలేదు కాబట్టి, రాసుకొని పాడటం ఏం ఉండదు. మాలో మేమే ఇట్ల పాడుదాం అనుకొని, పాట కట్టుకొని పాడుతాం అన్నట్టు.
మా ఊరినుంచే సంఘంలో 50 మంది మహిళా రైతులం ఉన్నం. అవసరమైతే విత్తనాలకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటం. మా సంఘంలో విత్తనాల బ్యాంకు ఉంది. వేరే వేరే ఊళ్ల నుంచి ఈడికొచ్చి తీస్కవోతరు. మేం కూడా కొంత మందికి ఇస్తం. మా ఆయన, కొడుకులు నాకు వ్యవసాయంలో సాయం జేస్తరు. అయితే మేం పంటలు మంచిగ పండిస్తున్నం అని, ఎట్ల పండియ్యాల్నో వేరే వాళ్లకి చెప్పాలని పెద్ద పెద్ద పట్టణాలకు మమ్మల్ని సంఘమోళ్లు తీస్కవోతుంటరు. అట్ల నేను నాగ్పూర్, ఢిల్లీ, విశాఖపట్నం… ఇసోంటి చాలా చోట్లకు పోయిన. ఢిల్లీలోమన ప్రధాన మంత్రి మోదీని కలిసి ఫొటో కూడా దిగిన. పోయినేడాది వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం వాళ్లు నాకు అవార్డు కూడా ఇచ్చిన్రు. వ్యవసాయం చేయడం అంటే నాకిష్టం. పండ్లు కూడా మేమే పండిచ్చుకొని తింటం. ఎంత బాగుంటది. ఇట్ల మంచిగ మనమే విత్తనాలు పెట్టుకొని పంట పండించుకుంటే గుండెల ఎంతో దైర్నం ఉంటది. నేనైతే ఉన్నన్ని రోజులు మందులెయ్యకుండనే పంట పండిస్త. నా పిల్లలకు ఇట్లనే చేయమని చెప్త!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– కోట సతీష్ కుమార్, సంగారెడ్డి