Fruits At Night | ఎప్పటికప్పుడు సీజన్లలో లభించే పండ్లతోపాటు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లను తరచూ తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే పండ్లను రోజూ తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. పండ్లను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లను మనం పండ్ల ద్వారా పొందవచ్చు. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. కొందరు పండ్లను కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే తింటారు. కానీ పండ్లను రోజూ తినాల్సిందేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే పగటి పూట పండ్లను తినడం వీలు కావడం లేదన్న వారు రాత్రి పూట వాటిని తినవచ్చు. కానీ రాత్రి పూట ఏ పండ్లను పడితే వాటిని తినకూడదు. రాత్రి పూట తినదగిన పండ్లు కొన్నే ఉన్నాయి. వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
రాత్రి పూట తినదగిన పండ్లలో కివిలు ప్రథమ స్థానంలో నిలుస్తాయని చెప్పవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల మన శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్రను ప్రేరేపించే హార్మోన్. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. అలాగే ఈ పండ్లను తింటుంటే యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. కివి పండ్లను రాత్రి పూట తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. అజీర్తి తగ్గుతుంది. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక రాత్రి పూట తినాల్సిన పండ్లలో చెర్రీలు కూడా ఒకటి. ఈ పండ్లను తినడం వల్ల మన శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా నిద్రను ప్రేరేపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నిద్రలేమి సమస్యలు ఉన్నవారు రాత్రి పూట ఈ పండ్లను తింటుంటే ఉపయోగం ఉంటుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇక రాత్రి పూట అరటి పండ్లను తినవచ్చు. కానీ కఫం అధికంగా ఉత్పత్తి అయ్యే వారు, అధిక బరువు ఉన్న వారు ఈ పండ్లను రాత్రి పూట తినకూడదు. మిగిలిన ఎవరైనా ఈ పండ్లను రాత్రి పూట తినవచ్చు. అరటి పండ్లను రాత్రి పూట తినడం వల్ల మెగ్నిషియం అధికంగా లభిస్తుంది. దీని వల్ల రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. అలాగే అరటి పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీని నియంత్రిస్తుంది. దీని వల్ల రాత్రి పూట బీపీ పెరగకుండా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
ఇక రాత్రి పూట బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలను కూడా తినవచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. నిద్రలేమిని తగ్గిస్తాయి. అలాగే క్యాన్సర్ కణాలతో పోరాటం చేస్తాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. రాత్రి పూట అవకాడో పండ్లను సైతం తినవచ్చు. వీటిల్లో ఉండే మెగ్నిషియం రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా చూస్తుంది. ఈ పండ్లలోని మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో రాత్రి పూట ఆహారం ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడవచ్చు. దీని వల్ల బరువు తగ్గడం తేలిగ్గా మారుతుంది. అలాగే రాత్రి పూట పుచ్చకాయలు, తర్బూజాలను కూడా తినవచ్చు. అతి మూత్ర వ్యాధి ఉంటే వీటిని తినకూడదు. రాత్రి పూట ఈ పండ్లను తినడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. అంతేకాకుండా నిద్ర చక్కగా పడుతుంది. ఇలా రాత్రి పూట ఆయా పండ్లను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది.