Nutrients | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలు మనకు రోజూ లభిస్తేనే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. అనేక విటమిన్లు, మినరల్స్, ఇతర సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పోషకాల జాబితాకు చెందుతాయి. ఇవన్నీ కేవలం ఒకే ఆహారంలో ఉండవు. కనుక మనం రోజూ ఇవన్నీ ఉండే భిన్న రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా చాలా మంది ఇంట్లో సరిగ్గా తినడం లేదు. బయటి ఆహారమే ఎక్కువగా తింటున్నారు. దీంతో పోషకాలు సరిగ్గా లభించక పోషకాహార లోపం వస్తోంది. దీని వల్ల అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలు లోపిస్తే వాటిని బట్టి భిన్న రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒక్కో పోషకాహార లోపాన్ని బట్టి భిన్న రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇక మన శరీరానికి అవసరం అయ్యే పోషకాల్లో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది అనేక జీవక్రియలకు సహాయం చేస్తుంది. మన శరీరంలో మెగ్నిషియం లోపిస్తే అరచేతులు తరచూ చల్లగా మారుతుంటాయి. శరీరం కూడా చల్లగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలంలో దీని వల్ల హైపో థైరాయిడిజం, గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తుంటే మెగ్నిషియం లోపం ఉన్నట్లు భావించాలి. మెగ్నిషియం ఉన్న ఆహారాలను తినాల్సి ఉంటుంది. అలాగే మన శరీరానికి కావల్సిన మరో ముఖ్యమైన పోషక పదార్థం జింక్. ఇది లోపిస్తే చర్మంపై తరచూ చారలు ఏర్పడుతుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గి తరచూ దగ్గు, జలుబు వస్తుంటాయి. జుట్టు బలహీనంగా మారి చిట్లిపోతుంది. చుండ్రు అధికంగా ఉంటుంది.
ఇక మన శరీరంలో విటమిన్ కె లోపిస్తే చిన్న దెబ్బలకే తీవ్ర రక్తస్రావం అవుతుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టదు. రక్తస్రావం అవుతూనే ఉంటుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. చిన్న దెబ్బలకే విరిగిపోతాయి. అలాగే మన శరీరంలో విటమిన్ సి లోపిస్తే రోగ నిరోధక శక్తి తగ్గి తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దంతాలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అవి నొప్పిగా కూడా ఉంటాయి. చర్మంలో తేమ నశిస్తుంది. చర్మం పొడిగా మారి కాంతిహీనంగా కనిపిస్తుంది. అలాగే మెగ్నిషియం లోపించడం వల్ల తరచూ నిద్రలో కాలి పిక్కలు పట్టేస్తుంటాయి. విటమిన్ బి12 లోపం ఉన్నా కొందరిలో ఇలాగే జరుగుతుంది. మోకాళ్లు, కీళ్ల నొప్పులు, వాపులు తరచూ వస్తున్నా మెగ్నిషియం, విటమిన్ బి12 లోపించాయని అర్థం చేసుకోవాలి.
సాధారణంగా అయోడిన్ లోపం ఉంటే థైరాయిడ్ సమస్యలు వస్తుంటాయి. కొందరికి గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథి ఉండే ప్రాంతంలో వాపులు కూడా కనిపిస్తాయి. ఇది దీర్ఘకాలంలో హైపో లేదా హైపర్ థైరాయిడిజంకు దారి తీస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో అయోడిన్ కూడా లోపిస్తే థైరాయిడ్ మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ కు మందులను వాడుతున్నా కూడా థైరాయిడ్ నియంత్రణలోకి రావడం లేదు అంటే అయోడిన్ లోపం ఉందేమో చెక్ చేసుకుని మందులను వాడాలి. అందుకు తగిన ఆహారం తినాలి. ఇక జింక్ లోపం ఉన్నవారిలో కొందరికి గోర్ల మీద తెల్లని మచ్చలు కనిపిస్తుంటాయి. గోళ్లు పెళుసుగా మారి చిట్లిపోతుంటాయి. అలాగే విటమిన్ బి2 లోపం ఉంటే ముఖం లేదా ముక్కుపై, నుదుటి మీద ఎర్రని దద్దుర్లు వస్తుంటాయి. ఇక శరీరంలో క్రోమియం స్థాయిలు తగ్గితే కళ్లలో శుక్లాలు ఏర్పడుతాయి. అలాగే షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. కళ్ల కింద నల్లని వలయాలు వస్తాయి. నాలుక పాలిపోయి తెల్లగా ఉంటే ఐరన్ లోపం ఉన్నట్లు గుర్తించాలి. ఇలా ఆయా పోషకాలు లోపిస్తే భిన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని గుర్తించడం ద్వారా ఏ పోషక పదార్థం లోపించిందో సులభంగా తెలుసుకుని అందుకు అనుగుణంగా మందులు లేదా ఆహారం తీసుకుంటే ఆ పోషక పదార్థ లోపం నుంచి సులభంగా బయట పడవచ్చు.