జీవితం అంటే సవాళ్లు, విమర్శలు, ప్రతికూలతల సమాహారం. కానీ, వాటిని ఎలా సంబాళించుకుంటామనే దానిపైనే మనం జీవితంలో ఎంత అభివృద్ది చెందుతామనేది ఆధారపడి ఉంటుంది. సవాళ్లు, విమర్శలు ఎదురైనప్పుడు వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటే మనకు ఆనందం దూరమైపోతుంది. ఈ క్రమంలో జీవితంలో సంతోషం కోల్పోకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఆచరించాలి.
ఇతరుల పట్ల, పరిస్థితుల పట్ల స్పందన మన ఆలోచనలు, భావోద్వేగాల ప్రతిబింబమే. దీన్ని అర్థం చేసుకుంటే ఇతరుల అభిప్రాయాలను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాం. జీవితంలో, వృత్తిలో ప్రశాంతంగా ఉంటాం.
ఇతరులతో భావోద్వేగపరంగా, భౌతికంగా సరిహద్దు రేఖ ఎక్కడ ఉండాలో తెలుసుకుని ఉండాలి. ఇది మీ శక్తిని, మానసిక శాంతిని కాపాడుకోవడంలో సహకరిస్తుంది.
మీ పట్ల మీరు దయతో మెలగాలి. ఎప్పుడైనా సవాళ్లు ఎదురైనప్పుడు మీ లోపలి విమర్శకుణ్ని మౌనంగా ఉంచాలి. ఇలా చేస్తే సమస్యల నుంచి త్వరగా కోలుకుని సంతోషంగా ఉండగల్గుతారు.
ప్రతి ఒక్కరినీ సంతృప్తిపర్చడం ఎవ్వరి తరమూ కాదు. అలా చేస్తే అది వృథా ప్రయత్నమే. కాబట్టి, మీ లక్ష్యాలు, అవసరాలకు అనుగుణంగా జీవించాలి. ఇది మీకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తుంది.
విమర్శలను వినాలి. కానీ, మంచి చెడ్డల విచక్షణ చూపాలి. నిర్మాణాత్మకమైన విమర్శలు అయితే వాటిపై దృష్టి పెట్టాలి. అంతేగాని వ్యక్తిగతంగా తీసుకుని తీవ్రంగా ప్రతిస్పందించ కూడదు.
మీ విలువల గురించి మీకు స్పష్టత ఉంటే ఇతరుల అభిప్రాయాలకు చలించరు. మీకు మీరు నిజాయతీగా ఉండాలి. ఈ లక్షణం జీవితంలో మీరు ఉన్నత లక్ష్యం వైపు దృష్టి సారించడానికి ఉపకరిస్తుంది.
జీవితంలో తిరస్కారాలు చాలా సహజం. వాటికి చింతిస్తూ కూర్చోవద్దు. తిరస్కారాలను జీవితంలో మలుపులకు అవకాశాలుగా ఆమోదించాలి.
మీకు అండగా నిలిచేవాళ్లు, మీ అభివృద్ధికి దోహదపడే వాళ్ల మధ్య గడపాలి. దీంతో జీవితంలో సానుకూలమైన మార్పు కనిపిస్తుంది.
ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే స్పందించడానికి ముందు కొంచెం ఆగండి. ఈ విరామం మీ మనసుకు కొంచెం ప్రశాంతత, స్పందించడానికి తగిన ప్రాతిపదికను ఇస్తుంది. లేకుంటే గొడవగా మారే అవకాశం ఉంది.
వ్యక్తి అభివృద్ధి చెందుతున్న క్రమంలో పొరపాట్లు, విమర్శలు, వైఫల్యాలు సహజం. వాటిని వ్యక్తిగతంగా తీసుకుని బాధపడొద్దు. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని లక్ష్యం దిశగా సాగిపోవాలి.