ఆడవాళ్లను ఎక్కువగా వేధించే సమస్యల్లో ‘అవాంఛిత రోమాలు’ ఒకటి. వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే ఈ సమస్య.. కొందరిని మానసికంగానూ కుంగదీస్తుంది. అయితే వీటిని తొలగించేందుకు కొందరు పడరాని పాట్లు పడుతుంటారు. బ్యూటీ పార్లర్లనీ, హెయిర్ రిమూవల్స్ అనీ.. ఏవేవో ప్రయత్నిస్తుంటారు. అన్నీ వాడి.. లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటారు. అయితే, ఇంట్లో దొరికే పదార్థాలతోనే అవాంఛిత రోమాలను పూర్తిగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా సహజసిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించడంలో పసుపు సమర్థంగా పనిచేస్తుంది. ఇందులోని సహజసిద్ధమైన గుణాలు.. వెంట్రుకల పెరుగుదలను నియంత్రించడంతోపాటు కుదుళ్లనూ బలహీనంగా మారుస్తాయి. పసుపులో కొద్దిగా పాలు కలిపి.. పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీనిని అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నచోట రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగి.. శుభ్రం చేసుకోవాలి.
బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ అనే ఎంజైమ్.. జుట్టు కుదుళ్లను విచ్ఛిన్నం చేయడంలో, వెంట్రుకల పెరుగుదలను నిరోధించడంలో ముందుంటుంది. బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసుకుని.. అలాగే ముఖంపై ఉండే అవాంఛిత రోమాలపై అప్లయి చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. అవాంఛిత రోమాలు తొలగిపోవడంతోపాటు ముఖ వర్చస్సూ పెరుగుతుంది.
నిమ్మరసం.. సహజసిద్ధమైన ఎక్సోఫోలియంట్గా పనిచేస్తుంది. ముఖంపై మృతకణాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో చక్కెరను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని.. సున్నితంగా మర్దనా చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. అవాంఛిత రోమాలు తొలగిపోవడంతోపాటు చర్మం మృదువుగానూ మారుతుంది.
తేనెలో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై అవాంఛిత రోమాలు పెరగకుండా నిరోధిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. నిమ్మరసంలో ఒక టీస్పూన్ తేనెను కలిపి.. అవాంఛిత రోమాలపై రాయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి.