ఫిట్నెస్ కోసం వర్కవుట్లు చేయడం మామూలే! అయితే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలి. ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. గుడ్లు, చికెన్, పప్పుధాన్యాల్లో మాంసకృత్తులు అధికంగా లభిస్తాయి. వర్కవుట్ల తర్వాత ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకపోతే ఫలితం అంతంతమాత్రమే అంటున్నారు నిపుణులు. అందుకే, వ్యాయామం ముగిసిన గంటలోపు ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కండరాలు గట్టిపడటంతోపాటు సత్వర శక్తి వస్తుందని చెబుతున్నారు.
వర్కవుట్ సెషన్ తర్వాత స్వల్ప కాల వ్యవధిని అనబాలిక్ విండోగా పిలుస్తారు. ఈ సమయంలో వ్యాయామం చేసిన వ్యక్తి కండరాల ఎదుగుదలకు, రికవరీకి ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్కవుట్స్ సమయంలో కండరాలు సున్నితంగా మారతాయి. కొన్నిసార్లు అవి నొప్పి కూడా కలిగిస్తాయి. ప్రొటీన్లు కలిగిన ఆహారం తింటే కండరాలు శక్తిని పుంజుకుంటాయి. అనబాలిక్ విండో ప్రభావం 24 గంటలపాటు ఉంటుందని మరికొందరి మాట.
అందుకే రోజులో ఏ సమయంలోనైనా ప్రొటీన్ ఫుడ్ తీసుకోవచ్చనీ చెబుతున్నారు. రోజులో కావాల్సిన ప్రొటీన్ ఒకేసారిగా కాకుండా, మూడు-నాలుగు దఫాలుగా తీసుకుంటే మంచిదని అంటున్నారు. అల్పాహారం, భోజనం, స్నాక్స్‌లో ప్రొటీన్ కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వర్కవుట్ల తర్వాత ఈ పదార్థాలు తీసుకుంటే శరీరానికి తగినన్ని ప్రొటీన్లు లభిస్తాయి. గుడ్డు మంచి ప్రొటీన్‌ను అందిస్తుంది. ఒకటి, రెండు ఉడకబెట్టిన గుడ్లు తిని, గ్లాసెడు పాలు తాగితే ఎనర్జిటిక్‌గా ఉంటారు.
కొబ్బరినీళ్లు, మునగాకు పొడి కలుపుకొని తాగినా శరీరానికి ప్రొటీన్లు అందుతాయి.
గుప్పెడు నానబెట్టిన బాదం పప్పు, కప్పు పెరుగు తీసుకోవచ్చు.
బీట్రూట్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కండరాల పటుత్వానికి ఇవి దోహదం చేస్తాయి. బీట్రూట్ ముక్కలు గానీ, జ్యూస్ గానీ తీసుకుంటే మంచిది.
ఉడికించిన శనగలు అంటే శరీరానికి ప్రొటీన్లు సమృద్ధిగా అందుతాయి.
సత్తుపిండి సత్వర శక్తిని ఇస్తుంది. కండరాలు బలోపేతం కావడానికి దోహదం చేస్తుంది.