ఎవరు సుప్రీం? పార్లమెంటా? ప్రభుత్వమా? రాష్ట్రపతా? సుప్రీం కోర్టా? ‘ఎవరూ కాదు.. అందరికీ రాజ్యాంగమే సుప్రీం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి అభిభాషణ. ‘అందరి విధ్యుక్త ధర్మాలను విశదపరిచేది, హక్కులను కాపాడేది రాజ్యాంగం. కోర్టులు రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్పేవి మాత్రమే’ అని ఆయన స్పష్టంగా తెలిపారు. అలాంటి కోర్టులు (న్యాయస్థానాలు) ఎంత పవిత్రంగా ఉండాలి? భారత ప్రజాస్వామ్యానికి మూడో మూలస్తంభం న్యాయవ్యవస్థ. ఆ వ్యవస్థకు సుప్రీం.. సుప్రీం కోర్ట్. ఈ అత్యున్నత న్యాయస్థానానికి దిగువ ప్రతిరూపాలు స్థానిక కోర్టులు. కోర్టుల్లో వాద ప్రతివాదాలు, తీర్పులు వక్రమార్గం పడితే మరి సంఘానికి దిక్కేది? మళ్లీ అరాచకానికి, హింసామార్గానికి తావివ్వడమే కదా? ఈ పాయింట్ ఆధారంగా రూపొందిన నాటకమే 27వ మైలురాయి. ఇది మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఓ యథార్థ సంఘటన.
రంగనాథం పేరున్న క్రిమినల్ లాయర్. కేసులు అక్రమమైనవి అయినా, సక్రమమైనవి అయినా డబ్బు కోసం వాదిస్తూనే ఉంటాడు. తీర్పు ఇచ్చే బాధ్యత న్యాయమూర్తిదే తప్ప, ఆ తీర్పు తప్పొప్పుల్లో తన పాత్ర ఏమీ ఉండదని ఆయన అభిప్రాయం. రంగనాథం మామగారు కూడా న్యాయవాదే. కానీ, ఆయన రంగనాథానికి భిన్నమైనవాడు. న్యాయవాది అన్నవాడు న్యాయపక్షపాతిగా ఉండాలే తప్ప క్లయింట్ పక్షపాతిగా ఉండరాదని నిర్దంద్వంగా చెబుతూ ఉంటాడు. అవేవీ రంగనాథం చెవికెక్కవు.
ఓ రోజు, అర్ధరాత్రి వేళ… విజయనగరానికి వచ్చే 27వ మైలురాయి వద్ద రంగనాథం కారు ఆగిపోతుంది. ఆ సమయంలో వర్షం కురుస్తుంటుంది. ఇంటికి ఫోన్ చేస్తే కూతురు ధరణి తన కారు తీసుకొని వస్తానంటుంది. ఇదే అదనుగా భావించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి రంగనాథాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తాడు. కత్తితో పొడుస్తాడు. ఎవరో అటుగా రావడం చూసి పారిపోతాడు. ఆ వచ్చింది రంగనాథం కూతురే. ఆగంతకుడి దాడిలో గాయపడిన తండ్రిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడుతుందామె. ఇంతకీ రంగనాథాన్ని చంపాలనుకున్నది ఎవరు? ఇదో మిస్టరీ. ఇక రంగనాథం కూతురు ధరణికి పెళ్లయింది. భర్తతో విభేదాలు తలెత్తడంతో పుట్టింట్లోనే ఉంటుంది. వారి పదేండ్ల కొడుకు తండ్రి దగ్గరే ఉంటుంటాడు.
రంగనాథ్‌పై హత్యాయత్నానికి పాల్పడింది ఎవరో కాదు.. ఆయన క్లయింటే! రాజన్న పేదవాడు. తన స్తోమతకు మించి కట్నం ఇచ్చి కూతురి పెళ్లి చేస్తాడు. అత్తింటి వాళ్లు రాజన్న బిడ్డను నానా అగచాట్లు పెడతారు. చెప్పనలవిగాని మానసిక క్షోభకు గురిచేస్తారు. భార్యాభర్తలు నాలుగు గోడల మధ్యన ఏకాంతంగా ఉన్న సమయంలో అత్తామామలు రహస్యంగా వీడియోలు తీస్తారు. వాటిని బ్లూ ఫిల్మ్‌గా మార్చి మార్కెట్లో సొమ్ము చేసుకుంటారు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక రాజన్న కూతురు బలవన్మరణానికి పాల్పడుతుంది. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని, తన బిడ్డను అమానవీయంగా పొట్టన పెట్టుకున్న వారికి కఠినంగా శిక్షపడేలా చేయాలని రాజన్న రంగనాథ్‌ను ఆశ్రయిస్తాడు.
అయితే, ఎక్స్‌పార్టీ వాళ్లకు అమ్ముడుపోయిన రంగనాథం.. రాజన్న కేసును సరిగ్గా వాదించడు. ప్రత్యర్థులు కేసు గెలిచేలా సహకరిస్తాడు. రాజన్న కొడుకు సూరి (దివ్యాంగుడు) పగతో రగిలిపోతాడు. రంగనాథాన్ని అంతు చేయాలని నిశ్చయించుకొని.. అతనిపై హత్యాయత్నానికి పాల్పడతాడు. రాజన్న కూడా కొడుక్కు సాయపడతాడు. చిత్రవిచిత్ర మలుపులు తిరిగి, మిస్టరీ వీడుతుంది. రాజన్న చివరికి రంగనాథాన్ని క్షమిస్తాడు. దీంతో కథ సుఖాంతం అవుతుంది. నాటక గమనం, నటీనటుల అభినయం, నేపథ్య సంగీతం ఉత్కంఠ భరితంగా సాగి ఈ నాటకం ప్రేక్షకుల్ని అలరించింది.
‘నిజం గెలుస్తుంది’ అన్న మాట నిజమే. కానీ, గెలిచిందంతా నిజం కాదు అన్న సత్యాన్ని నాటకం ప్రకటిస్తుంది. రసరంజని, హైదరాబాద్ ఆధ్వర్యంలో జూన్ 26న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నాటకం ప్రదర్శితమైంది.
నాటకం పేరు: 27వ మైలురాయి.
రచన: పి.టి. మాధవ్
దర్శకత్వం: వాసు
సమర్పణ: యంగ్ థియేటర్ అసోసియేషన్
సంగీతం: లీలా మోహన్
పాత్రధారులు: నటరాజ్, సురభి ప్రభావతి, జాహ్నవి, పవన్, వాసు, వరప్రసాద్ తదితరులు
…? కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు