వెనుకటి రోజుల్లో.. చదువులతో పాటు కళల్నీ బోధించేవారు. చదువులు అక్షరాన్ని ఇస్తే, కళలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని నమ్మేవారు. విద్యలో నాణ్యత లోపించిన నేటి తరం పిల్లలకు.. కళల్ని పరిచయం చేసే బాధ్యత తీసుకున్నది ఓ విశ్రాంత ఉపాధ్యాయుల జంట.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవిక్ ఘోష్, ఆయన భార్య గార్గి మూడు దశాబ్దాలు ఉపాధ్యాయులుగా పనిచేశారు. శేష జీవితం
విశేషంగా గడపాలని అనుకున్నారు. అంతేకానీ, అందరిలా మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ కాలం వెళ్లదీయాలని ఆశ పడలేదు. పిల్లల్లో సృజనాత్మకతకు పదును పెట్టడానికి 2019లో శాంతినికేతన్లో చిల్ట్రన్స్ థియేటర్ అకాడమీని స్థాపించారు. కొత్త ఆలోచనల్ని ప్రసాదించడంలో కళలు ఎంతగానో తోడ్పడతాయని గార్గి నమ్మకం.
అకాడమీని స్థాపించిన కొద్ది కాలానికే దేశంలో లాక్డౌన్ విధించారు. దీనివల్ల కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందేమో అని ఆ దంపతులు ఆందోళన చెందారు. అయితే, విద్యార్థులు తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించి ఆన్లైన్ వేదికగా ప్రదర్శనలు మొదలుపెట్టారు. ఒక చిన్న కథ అనుకొని దానికి అనుగుణంగా ఒకట్రెండు పాత్రలు సృష్టించి తామే నటించేవారు. చివర్లో జీవన నైపుణ్యాల్ని బోధించేవారు. ఇప్పటికీ అదే ఫార్ములా.
కాకపోతే, నేరుగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు ఘోష్, గార్గి. నటన, నృత్యం తదితర కళల వల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధం మరింత బలోపేతం అవు తుందని, చిన్నారుల్లో నిజాయతీ, నిర్భీతి అంకురిస్తాయని అంటారు ఆ ఇద్దరూ. అవిక్ ఘోష్, గార్గి కోల్‌కతాలోని ఓల్డ్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. అక్కడే ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. పదవీ విరమణ తర్వాత కూడా ఇద్దరూ కలసి సామాజిక బాధ్యత తీసుకున్నారు.