నగరాలతోపాటు చిన్నచిన్న పట్టణాల్లోనూ పెరటితోటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబానికి అవసరమైన కూరగాయలు, పండ్లను ఇంటి వద్దే పండించుకుంటున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులను బట్టి పంటలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షకాలానికి తగినట్లుగా మొక్కలను ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు.
కొన్ని మొక్కలు సహజంగానే తడి పరిస్థితులను తట్టుకుంటాయి. కాబట్టి, పెరటి మొక్కల పెంపకం కోసం తదనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి. పాలకూర, కాలే, మెంతి లాంటి ఆకుకూరలు తేమ వాతావరణంలో సులభంగా పెరుగుతాయి. అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ.. తాజా పంటను చేతికందిస్తాయి. ఈ కాలంలో వ్యవసాయ క్షేత్రాల్లో పండించిన ఆకుకూరలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే, వరదల వల్ల ఆకు కూరలు తీవ్రంగా దెబ్బతింటాయి. వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివీ పెరుగుతాయి. ఇక కూరగాయల విషయానికి వస్తే.. టమాటాలు, క్యారెట్లు, బంగాళాదుంప లాంటి పంటలకు దూరంగా ఉండాలి. ఇవి ఎంతో సున్నితమైన పంటలు. వర్షాలకు ఇట్టే దెబ్బతింటాయి. కుళ్లిపోవడం, శిలీంధ్ర వ్యాధులకు ఎక్కువగా గురవుతాయి. అంతేకాకుండా.. విత్తనాలు, మొలకలను ఎంచుకునేటప్పుడు వ్యాధి నిరోధక రకాలను ఎంచుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంతో వచ్చే తేమ, తెగుళ్ల ఒత్తిడిని ఇవి తట్టుకుంటాయి.