కాలంతోపాటు ఎన్నిరకాల కొత్త ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా భారతీయ స్త్రీల అలంకరణలో సంప్రదాయ ఆభరణాలదే అగ్రస్థానం. కంఠాభరణాలు, హారాలు, పాపిటబిళ్లలు, గాజులు, వంకీలు లాంటి నగలు ప్రాచీనకాలం నుంచీ మహిళల అలంకరణలో భాగమయ్యాయి. ఒక్కో నగదీ ఒక్కో ప్రత్యేకత. కొన్ని వజ్రాలు పొదిగి ఉంటే, మరికొన్ని రత్న ఖచితమై ఆకర్షిస్తుంటాయి. ఈ తరహా ఆభరణాలకు భిన్నమైనవి థెవా జువెలరీ.
స్వచ్ఛమైన బంగారంతో రూపుదిద్దుకున్న ఈ నగలకు శతాబ్దాల చరిత్ర ఉంది. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ ప్రాంతం థెవా ఆభరణాలకు పుట్టినిల్లుగా చెబుతారు. ఇక్కడి స్వర్ణకారులు తమ మేధతో వీటిని సృష్టించారు. బ్రిటిష్ పాలకుల హయాంలో ఇంగ్లిష్ దొరసానులు ఈ నగల నిగనిగలకు ఫిదా అయ్యారట. అలా ప్రతాప్‌గఢ్ గడపలో ప్రాణం పోసుకున్న థెవా నగలు ఖండాంతరాలు దాటి బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిన మేర ఆదరణకు నోచుకున్నాయి.
గాజు పలకపై బంగారంతో రసరమ్యమైన రూపాలను నిలిపి థెవా నగలను తయారుచేస్తారు. ప్రాచీన కాలంలో ఈ కళను ప్లేట్లు, ట్రేలు, పూలకుండీల తయారీలో వాడేవారు. తర్వాత కాలంలో ఆభరణాల తయారీలో ఉపయోగించారు. రాజపుత్రుల హయాంలో థెవా ఆభరణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 23 క్యారెట్ల బంగారంతో వీటిని తయారుచేస్తారు. రంగులీనే గాజు లాకెట్‌పై బంగారంతో అందమైన డిజైన్లు తీర్చిదిద్దుతారు. పక్షులు, జంతువులు, నదులు, గిరులు ఇలా ప్రకృతి సౌందర్యాన్ని చిత్రికపట్టి తయారుచేసిన లాకెట్లు ముచ్చటగొలుపుతాయి.
సీతారాములు, రాధాకృష్ణుల రూపాలనూ కొలువుదీర్చి ట్రెడిషనల్ లుక్ తెస్తున్నారు. వీటిని ఈ తరానికి చేరువ చేసేలా మరింత నాజూగ్గా తయారు చేస్తున్నారు డిజైనర్లు. భారీ ఆభరణాల నుంచి సన్నని గొలుసుల వరకు అందుబాటులోకి తెస్తున్నారు. రాజస్థానీ సంప్రదాయ శైలిగా పేరున్న థెవా జువెలరీపై ఈ తరం మగువలు మనసు పారేసుకుంటున్నారు. బంగారంతోపాటు వెండి, ఫ్యాన్సీ, ఇతర మెటీరియల్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయివి.