కార్పొరేట్ ప్రపంచంలో ‘పని ఒత్తిడి’ కామన్ అయిపోయింది. ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ క్రమంలో.. ‘కిడల్టింగ్’ వారికి భరోసా ఇస్తున్నది. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటినుంచో ఉన్న ఈ ట్రెండ్.. మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నది. పెద్దవాళ్లను బాల్యంలోకి తీసుకెళ్లే ఈ నయా ట్రెండ్ సంగతులివి..
పార్క్‌లో వాకింగ్ చేస్తున్నప్పుడు.. పిల్లల ప్లేగ్రౌండ్‌లో ఒకరిద్దరు పెద్దవాళ్లు కనిపిస్తుంటారు. ఊయల ఊగుతూ.. ైస్లెడింగ్పై నుంచి జారుతూ.. పిల్లల్లో చిన్నపిల్లల్లా కలిసిపోయి.. ఆడుకుంటూ ఉంటారు. ఆ క్షణం.. తమకున్న అన్ని టెన్షన్లనూ పక్కన పెట్టేస్తారు. మనస్తత్వ నిపుణులు చెబుతున్న ‘కిడల్టింగ్ ట్రెండ్’ అదే! పిల్లలతో కలిసి సైకిల్ తొక్కడం, బొమ్మలు గీయడం, క్యారమ్స్ ఆడటం, లెగోస్తో బొమ్మలు చేయడం.. ఇలాంటి చిన్ననాటి ఆటలు, పెద్దవాళ్ల గతాన్ని తవ్వితీస్తాయి. తాము స్వేచ్ఛగా, ఆనందంగా గడిపిన సమయంలోకి తీసుకెళ్తాయి. బాల్య జ్ఞాపకాల్ని తట్టిలేపుతాయి.
ముఖ్యంగా నెలవారీ టార్గెట్లు, ఆడిట్ లాంటి ఒత్తిడిని పెంచే పనులు ఉన్నప్పుడు.. ‘కిడల్టింగ్’ ఉపశమనం ఇస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. వాకింగ్ తర్వాత కాసేపు పార్కులోనే ఆడుకోవడం, బోర్డ్ గేమ్‌లలో మునిగిపోవడం వంటి ఏ రకమైన చర్య అయినా.. మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. అంతేకాకుండా.. చిన్నపిల్లల్లా ఆనందించడం వల్ల వారిలో ‘నోస్టాల్జియా’ భావాలు పెరుగుతాయి. ఇవి గతానికి-వర్తమానానికి మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తాయి. బాధలో ఉన్నవారికి ఓదార్పునిస్తాయి. భరోసానిస్తాయి. మానసిక ఆరోగ్యానికీ ఎంతో మేలుచేస్తాయి. కిడల్టింగ్.. శరీరంలో డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుందట. ఇది.. మనిషిలో ఒత్తిడి, విచారం, కోపం, ఆందోళనను తగ్గిస్తుందట.
కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా పెద్దవాళ్లను కిడల్టింగ్ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. అమెరికాలో టాయ్ అసోసియేషన్ ఓ సర్వే నిర్వహించింది. అక్కడ పిల్లల బొమ్మలు, ఆట వస్తువులను కొనుగోలు చేసిన 2,000 మంది తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించింది. వారిలో 58 శాతం మంది.. పిల్లల కోసం కాకుండా, తమ కోసమే బొమ్మలు, ఆట వస్తువులు కొనుగోలు చేశారని నివేదించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రధాన నగరాల్లో పెద్దలు ఆడుకునేలా ‘బల్లీ బాలర్సన్’ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిని ప్రతినెలా వేలాదిమంది సందర్శిస్తున్నారు కూడా! మరెందుకు ఆలస్యం.. ఆఫీస్, ఆర్థిక, కుటుంబ సమస్యలన్నీ మరిచిపోండి. రోజులో కొంత సమయమైనా చిన్నపిల్లల్లా గడపండి. మళ్లీ బాల్యంలోకి వెళ్లండి.. ఒత్తిడిని జయించండి.