ఆనందం కోసమో.. హాబీ కోసమో.. చాలామంది ఇళ్లల్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటారు. అందమైన చేపపిల్లల్ని పెంచుకుంటారు. వాటికి ప్రేమగా ఆహారం అందిస్తుంటారు. అయితే, తెలియకుండానే వాటికి ఎక్కువగా తిండి పెడుతుంటారు. ఈ అలవాటు.. చేపలకు ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్వేరియంలో చేపలకు ఆహారం పెట్టడం అనేది.. వాటిపై ప్రేమతో చేసే పనిలాగే అనిపిస్తుంది. కానీ, చాలామంది ఉత్సాహంతో ఎక్కువ ఆహారం వేసేస్తుంటారు. ఇది చేపల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. మొత్తం అక్వేరియంలోని వాతావరణాన్నే ప్రభావితం చేస్తుంది. ఇలా ఆహారం అతిగా వేస్తూ పోతే.. నీరు కలుషితమై దీర్ఘకాలంలో చేపలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
అక్వేరియంలోని చేపలకు ఎక్కువ ఆహారం ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎవరైనా ట్యాంక్ దగ్గరికి వచ్చినప్పుడు చేపలు పైకి ఈదుతాయి. దాంతో చాలామంది అవి ఆకలితో ఉన్నాయని భావిస్తారు. ఆహారం వేస్తారు. కానీ, ఈ ప్రవర్తన.. వాటి ఆకలిని సూచించదని గుర్తించాలి. ఇక చేపలకు ఆహారం ఇవ్వడం అనేది యజమానులు వాటితో సంభాషించే ఏకైక మార్గం. చేపలు అచ్చికలాడుతాయని అటుగా వెళ్లినప్పుడల్లా కొందరు ఆహారం అందించేస్తుంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నా.. ఎవరైనా బంధువులు వచ్చినా చేపలకు ఆహారం వేయడానికి ఆసక్తి చూపుతారు. ఊర్లకు, విహార యాత్రలకు వెళ్లినప్పుడు కొందరు ఒకేసారి ట్యాంక్లో పెద్దమొత్తంలో ఆహారాన్ని వేస్తుంటారు. ఈ ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ.. ఈ అలవాట్లన్నీ అక్వేరియం వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
అక్వేరియంలో ఎక్కువ ఆహారం వేస్తే.. చాలావరకూ వృథాగా మిగిలిపోతుంది. ఆ ఆహారం కుళ్లిపోయి అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న అక్వేరియాల్లో విషంతో సమానంగా పరిణమిస్తుంది. అమ్మోనియా స్థాయులు పెరిగేకొద్దీ.. నైట్రేట్లు కూడా పెరుగుతాయి. ఈ రసాయన మార్పులు అక్వేరియంలోని సహజత్వాన్ని దెబ్బతీస్తాయి. నీరు కలుషితమైపోయి.. నాచు పెరిగిపోతుంది. ఈ నాచు ట్యాంక్ గోడలను కప్పి ఉంచి.. కాంతిని నిరోధిస్తుంది. దీంతో ఆక్సిజన్ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా నీటిని ఫిల్టర్ చేయడంలో సాయపడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడి చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది.
ఎక్కువ ఆహారం తీసుకునే చేపల్లో మలబద్ధకం, మూత్రాశయ సమస్యలు వస్తాయి. అలాంటి చేపలు పక్కకు తేలుతూ, నిటారుగా ఉండటానికి ఇబ్బంది పడుతుంటాయి. ఈ సమస్యను నివారించడానికి చేపలకు ఒకటి-రెండు నిమిషాల్లోనే పూర్తి చేయగలిగిన ఆహారం మాత్రమే పెట్టాలి. చాలారకాల అక్వేరియం చేపలు మూడు రోజుల వరకూ ఆహారం లేకుండా ఉండగలవు. అందుకు తగ్గట్టుగా ఆహారాన్ని అందివ్వాలి. అప్పుడే.. చేపలతోపాటు అక్వేరియంలోని వాతావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.