చలికాలంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలిగాలులు, పొగమంచు.. అన్నీ కలిపి ఆరోగ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడతాయి. వీటిబారిన పడకుండా ఉండాలంటే.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. తినే ఆహారం విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని ఇంటి చిట్కాలు పాటించినా.. చిన్నచిన్న సమస్యలు దూరం అవుతాయి.
శీతాకాలంలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు.. తక్కువ నీరు తీసుకోవడం. అన్ని కాలాలకు తగ్గట్టే.. ఈ సమయంలోనూ శరీరానికి కావాల్సినంత నీళ్లు తాగాలి. కానీ, వాతావరణం చలిగా ఉండటం వల్ల ఎక్కువగా దాహం వేయదు. చీటికీమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది కూడా. దాంతో, చాలామంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఈ పరిస్థితి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అనేక సమస్యలకు కారణమవుతుంది. శరీరంలోని ట్యాక్సిన్స్‌ను తొలగించాలన్నా, రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలన్నా.. తగినన్ని నీళ్లు తాగాలి. మామూలు నీటికి బదులుగా.. గోరువెచ్చని నీరు తీసుకోవడం మంచిది.
చలికాలంలో ఇబ్బంది పెట్టే మరో సమస్య.. గొంతు ఇన్ఫెక్షన్. ఇలాంటప్పుడు వేడివేడి టీ లేదా కాఫీని ఆశ్రయిస్తుంటారు. అయితే, టీ, కాఫీలో ఉండే కెఫిన్.. ఆరోగ్యానికి మంచిదికాదు. వాటికి బదులుగా హెర్బల్ టీలను తాగొచ్చు. అల్లం టీ, మిరియాల పాలు కూడా మంచి ఉపశమనం అందిస్తాయి.
ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల జలుబు ఇబ్బంది పెడుతుంది. ముక్కు రంధ్రాలు మూసుకుపోయి.. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి సమయంలో మామూలుగా ఆవిరి పడుతుంటారు. అయితే, అవిరి పట్టే నీటిలో కొన్ని చుక్కల లావెండర్ నూనె వేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.